లోయలో పడిన కారు.. వర్ధమాన హీరోయిన్, ఆమె కాబోయే భర్త దుర్మరణం

22-09-2021 Wed 13:38
  • గోవా పర్యటనలో ప్రమాదం
  • నీళ్లలో మునిగి మృత్యువాత
  • వచ్చే నెలలోనే వారికి నిశ్చితార్థం
  • ఓ మరాఠీ, ఓ హిందీ సినిమాలో నటించిన ఈశ్వరి
Budding Heroine and Her Fiance Dies As Their Car Plunges Into Creek

ఆమె సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని రోజులే అవుతోంది. హీరోయిన్ గా ఒకే ఒక్క సినిమా చేసింది. వర్ధమాన నటిగా తనేంటో నిరూపించుకునేందుకు సిద్ధమైంది. అంతేకాదు, వచ్చే నెలలోనే తనకు కాబోయే వాడితో నిశ్చితార్థం చేసుకుని జీవితంలో హాయిగా ఉండాలనుకుంది. కానీ, విధి మరొకటి తలచింది. రోడ్డు ప్రమాద రూపంలో ఆమెను, ఆమెకు కాబోయేవాడిని, వారి కలలను తీసుకెళ్లిపోయింది.

సోమవారం తెల్లవారుజామున గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరాఠీ నటి ఈశ్వరీ దేశ్ పాండే (25), ఆమె స్నేహితుడు, కాబోయే భర్త శుభమ్ దాద్గే (28)లు మరణించారు. ఈనెల 15న గోవా పర్యటనకు వెళ్లిన వారిద్దరూ అనూహ్యంగా సోమవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రమాదానికి గురయ్యారు.


వారు ప్రయాణిస్తున్న కారు గోవాలోని బర్దేజ్ తాలూకాలో ఉన్న అర్పూరా గ్రామంలోని బాగా లోయలో పడిపోయిందని పోలీసులు తెలిపారు. మూలమలుపు వద్ద కారు అదుపుతప్పి లోయలో పడిందని, నీళ్లలో పడిన వెంటనే కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వల్ల వారు తప్పించుకోవడానికి వీల్లేకుండా పోయిందని చెప్పారు.

ప్రమాద విషయం ఉదయం 7 గంటలకు తెలిసిందని, వెంటనే వెళ్లి కారును, మృతదేహాలను బయటకు తీశామని తెలిపారు. కాగా, ఈశ్వరి మరాఠీ సినిమా ‘ప్రేమచే సైడ్ ఎఫెక్ట్స్’ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. త్వరలో ఆ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. హిందీలోనూ ఓ సినిమా చేసింది. అది కూడా ఇంకా విడుదల కాలేదు.