Andhra Pradesh: టీటీడీ ‘ప్రత్యేక ఆహ్వానితులకు’ హైకోర్ట్​ బ్రేక్.. జీవో నిలిపివేత

AP High Court Suspends TTD Special Guests GO
  • ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు
  • నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
  • 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
  • నిబంధనలు ఉల్లంఘించారంటూ పిటిషన్లు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.

టీటీడీ బోర్డులో సభ్యుల నియామకాన్ని సవాల్ చేస్తూ బీజేపీ నేత భానూప్రకాశ్ రెడ్డి, జనశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు కాకుమాను లలిత్ కుమార్, టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు సహా పలువురు పిటిషన్లను దాఖలు చేశారు. నిబంధనలను తోసిరాజని సభ్యులను నియమించారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. దాని వల్ల సామాన్య భక్తులపై పెనుభారం పడుతుందని వాదించారు.

పిటిషనర్ల వాదనలను విన్న కోర్టు.. ప్రభుత్వ ఉత్తర్వులపై సీరియస్ అయింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. కాగా, ఇటీవల ఏపీ ప్రభుత్వం టీటీడీ బోర్డులో 25 మంది సభ్యులను నియమించింది. వారితో పాటు మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది.

అందులో కొందరు ప్రమాణం కూడా చేశారు. అయితే, వివిధ కేసుల్లో ఉన్న వారినీ పవిత్రమైన బోర్డులో నియమించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆ నియామకాలను రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపించాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిఫార్సు చేశారంటూ ఒక సభ్యుడి నియామకంపై ఓ లేఖ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాను ఎవరినీ సిఫార్సు చేయలేదని తర్వాత కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
Andhra Pradesh
Telangana
TTD
Tirumala
Tirupati
High Court
AP High Court

More Telugu News