రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్!

22-09-2021 Wed 11:48
  • విడుదలకి సిద్ధమైన 'మహా సముద్రం'
  • షూటింగు పూర్తి చేసుకున్న 'ఒకే ఒక జీవితం'
  • సెట్స్ పై ఉన్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
  • వక్కంతం వంశీ కథతో మరో సినిమా  
Sharwanand in Raju Sundaram movie
యూత్ లోను.. ఫ్యామిలీ ఆడియన్స్ లోను శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. చకచకా సినిమాలు చేసేయాలనే హడావిడి ఆయనలో ఎప్పుడూ కనిపించదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాడు. అయితే కొంతకాలంగా ఆయనకి సరైన హిట్ లేదు. అందువలన ఆయన సాధ్యమైనంత త్వరగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మహాసముద్రం' పూర్తిచేశాడు. అక్టోబర్ 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కొత్త దర్శకుడితో 'ఒకే ఒక జీవితం' సినిమాను కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం మాత్రం కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తరువాత ఆయన రాజు సుందరం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లే అందించినట్టుగా చెబుతున్నారు. కథ వినగానే శర్వానంద్ ఓకే చెప్పేశాడని అంటున్నారు. తమిళంలో ఒకటి రెండు సినిమాలు తెరకెక్కించిన రాజు సుందరానికి శర్వానంద్ ఛాన్స్ ఇవ్వడం విశేషం.