NCP: శరద్ పవార్ వెన్నుపోటుదారన్న శివసేన నేత గీతే.. జాతీయ నేతగా అభివర్ణించిన సంజయ్ రౌత్

Backstabber Sharad Pawar Can t Be Our Guru Says Shiv Sena Leader
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే
  • కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి ఎన్సీపీని ఏర్పాటు చేశారని వ్యాఖ్య
  • ఆయన వ్యాఖ్యలపై తనకు అవగాహన లేదన్న సంజయ్ రౌత్
ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌పై శివసేన నేత, కేంద్ర మాజీ మంత్రి అనంత్ గీతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌లో సోమవారం నిర్వహించిన సభలో గీతే మాట్లాడుతూ.. శరద్ పవార్ వెన్నుపోటుదారని, కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచి ఎన్సీపీని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. శివ సైనికులకు ఆయన ఎప్పుడూ 'గురు' కాలేరని, ఎప్పటికీ తమకు నాయకుడు కాలేరని తేల్చి చెప్పారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిపి మహావికాస అఘాడీ పేరుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూటమిలో కీలకంగా ఉన్న ఎన్సీపీపైనే శివసేన నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు శివసేన అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. శరద్ పవార్‌ను ‘జాతీయ స్థాయి నేత’గా అభివర్ణించడం గమనార్హం. ఇలా ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతలు శరద్ పవార్‌పై వేర్వేరుగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

కాగా, శరద్ పవార్‌పై అనంత్ గీతే చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రౌత్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. గీతే వ్యాఖ్యల గురించి తనకు తెలియదన్నారు. రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర మొత్తం తమ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. తామంతా కలిసే ఉన్నామని వివరించారు.
NCP
Shiv Sena
Sharad Pawar
Anant Geete
Sanjay Raut

More Telugu News