రాజస్థాన్ సంచలన విజయం.. పంజాబ్‌పై రెండు పరుగుల తేడాతో గెలుపు

22-09-2021 Wed 06:39
  • ఐపీఎల్‌లో అసలైన మజా అందించిన మ్యాచ్
  • పంజాబ్ చేతుల్లోంచి విజయాన్ని లాగేసుకున్న కార్తీక్ త్యాగి
  • చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయలేక బోల్తా పడిన పంజాబ్
IPL 2021 Rajasthan Sensational Victory over Punjab Kings

టీ20 క్రికెట్ అంటేనే సంచలనాలు. విజయం క్షణక్షణానికీ పార్టీలు మార్చేస్తూ ఉంటుంది. చివరి వరకు ఎవరికీ అందకుండా దోబూచులాడుతుంటుంది. అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తుంది. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్-పంజాబ్ కింగ్స్ మధ్య దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే జరిగింది. విజయం అటుఇటు మారుతూ చివరికి రాజస్థాన్‌నే వరించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 19 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగా చేతిలో బోల్డన్ని వికెట్లు ఉన్నాయి. కావాల్సింది నాలుగు పరుగులు. ఈ సమయంలో ఎవరైనా పంజాబ్‌ సునాయాసంగా గెలుస్తుందని భావిస్తారు. అంతేకాదు, పంజాబ్ శిబిరంలో సందడి వాతావరణం కూడా నెలకొంది. కానీ అక్కడే అద్భుతం జరిగింది.

కార్తీక్ త్యాగి వేసిన చివరి ఓవర్ తొలి బంతికి పంజాబ్‌కు పరుగేమీ రాలేదు. రెండో బంతికి ఓ పరుగు వచ్చింది. ఇంకా నాలుగు బంతులు ఉండగా విజయానికి మూడు పరుగులు కావాలి. కానీ, మూడో బంతికి పూరన్ అవుటయ్యాడు. దీంతో పంజాబ్ శిబిరంలో ఉత్కంఠ. అయినా, ఇంకా మూడు బంతులు మిగిలి ఉన్నాయి కాబట్టి గెలుపుపై పంజాబ్ ధీమాగా ఉంది. త్యాగి వేసిన నాలుగో బంతికి పరుగేమీ రాలేదు.

దీంతో టెన్షన్ మరింత పెరిగింది. ఐదో బంతికి మళ్లీ వికెట్. దీంతో పంజాబ్ డగౌట్లో కలవరం. ఇక, చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా కార్తీక్ సంధించిన చివరి బంతికి పరుగేమీ రాలేదు. దీంతో అనూహ్యంగా రాజస్థాన్‌ను విజయం వరించింది. విజయం అందినట్టే అంది చేజారడంతో పంజాబ్ శిబిరంలో నిర్వేదం నిండుకుంది. ప్రేక్షకులకు ఈ మ్యాచ్ ఐపీఎల్‌లోని అసలైన అనుభూతిని పంచింది.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ బౌలర్లు ఆది నుంచీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ ఆటగాళ్లు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ స్కోరు తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

లూయిస్ (36), జైశ్వాల్ (49), లివింగ్ స్టోన్ (25) క్రీజులో ఉన్నంత సేపు పరుగులు ధారాళంగా వచ్చాయి. ఇక లోమ్రోర్ అయితే చెలరేగిపోయాడు. 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 43 పరుగులు చేయడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. జట్టులోని ఏడుగురు ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. అర్షదీప్ బౌలింగ్‌కు రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. షమీ మూడు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. కేఎల్ రాహుల్ (49), మయాంక్ అగర్వాల్ (67) చెలరేగినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరి ఓవర్‌లో ఒత్తిడికి గురైన పంజాబ్ చేజేతులా వికెట్లు పారేసుకుని అనూహ్యంగా ఓటమి పాలైంది. మార్కరమ్ అజేయంగా 26 పరుగులు చేయగా పూరన్ 32 పరుగులు చేశాడు.

రాజస్థాన్ బౌలర్లలో త్యాగి రెండు వికెట్లు తీసుకోగా, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా చెరో వికెట్ తీసుకున్నారు. చివరి ఓవర్‌ను అద్భుతంగా వేసి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించి పెట్టిన కార్తీక్ త్యాగికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో 5వ స్థానానికి చేరుకోగా, పంజాబ్ కింది నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్‌లో నేడు ఢిల్లీ కేపిటల్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతుంది.