అవుటయ్యాననే కోపంతో బ్యాటు విసిరిన బ్యాట్స్‌మెన్.. ఎవరికి తగిలిందో చూడండి!

21-09-2021 Tue 22:51
  • పరుగు కోసం పిలవడంతో ముందుకెళ్లిన నాన్‌స్ట్రైకర్ బ్యాట్స్‌మెన్
  • ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వికెట్లకు తగలడంతో అవుట్
  • కోపంతో బ్యాట్ విసరగా స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ముఖానికి తగిలిన బ్యాట్
He throws bat in anger and it flew straight to striking batsment face

క్రికెట్‌లో రన్ అవుట్‌లు కొన్నిసార్లు సహచర బ్యాట్స్‌మెన్ తప్పిదం వల్ల జరుగుతాయి. ఇలాంటి అనుభవాలు స్టార్ క్రికెటర్లకు కూడా ఎదురైన సంఘటనలు బోలెడు. ఇలాగే స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ చేసిన చిన్న తప్పిదం వల్ల నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న ఆటగాడు అవుట్ అయ్యాడు. దీంతో కోపం వచ్చిన అతను విసురుగా బ్యాట్ గాల్లోకి విసిరాడు. అది కాస్తా నేరుగా వెళ్లి స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ముఖంపై తగిలింది. ఈ వింత ఘటనకు సంబంధించిన వీడియోను టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ షేర్ చేశాడు.

క్లబ్ క్రికెట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ షాట్ కొట్టిన వెంటనే పరుగు కోసం సహచరుడిని పిలిచాడు. దీంతో అతను సగం పిచ్ దాటేశాడు. కానీ అప్పటికే ఫీల్డర్ ఆ బంతిని అందుకున్నాడు. దీంతో బ్యాట్స్‌మెన్ వెనుతిరిగి, పరుగు వద్దన్నాడు. అప్పటికే సగం పిచ్ వరకూ వచ్చేసిన నాన్‌స్ట్రైకింగ్ బ్యాట్స్‌మెన్ వెనుతిరిగినా ప్రయోజనం లేకపోయింది. ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది.

ఇలా అవుటవడంతో ఆ బ్యాట్స్‌మెన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. కోపంతో పెవిలియన్ బాట పట్టి, విసురుగా బ్యాట్‌ను విసిరి కొట్టాడు. ఆ బ్యాటు నేరుగా వెళ్లి స్ట్రైకింగ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ ముఖానికి తగిలింది. దీంతో కంగారు పడిన అతను సహచరుడి వద్దకెళ్లి దెబ్బ గట్టిగా తగిలిందా? అంటూ అడిగాడు. ఈ దృశ్యం చూసిన జట్టు ఫిజియో కూడా వెంటనే మైదానంలోకి వచ్చి బ్యాట్స్‌మెన్ పరిస్థితిని పరిశీలించాడు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన వాళ్లు ఈ ఘటన పొరపాటున జరిగిందా? లేక బ్యాట్ విసిరిన ప్లేయర్ కావాలనే అలా విసిరాడా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.https://www.instagram.com/p/CUCWq-_BJc3