ఒక్కసారిగా 7300 కోట్లు నష్టపోయిన రియల్ ఎస్టేట్ దిగ్గజం

21-09-2021 Tue 19:08
  • ఉదయం 1.3 బిలియన్ డాలర్ల సంపద
  • మధ్యాహ్నానికల్లా 250 మిలియన్లకు చేరిక
  • పతనం అంచున చైనా బిలియనీర్ జాంగు యువాన్‌లింగ్
Billionnaire loses 7300 crores in hours

ఇటీవలి కాలంలో బిలియనీర్లంతా ఇబ్బందులు పడుతున్న దేశం ఏదైనా ఉందంటే అది చైనానే. ఈ దేశంలో తాజాగా మరో బిలియనీర్ పతనం అంచుకు చేరుకున్నాడు. సోమవారం ఉదయం 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద మధ్యాహ్నం కల్లా 250.7 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ బిలియనీరే జాంగ్ యువాన్‌లింగ్.

చైనాలో రియల్ ఎస్టేట్ రంగంలోని ప్రముఖ కంపెనీల్లో జాంగ్‌కు చెందిన సినిక్ హోల్డింగ్స్ ఒకటి. ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో కూడా జాంగ్ చోటు సంపాదించారు. అలాంటి వ్యక్తికి సోమవారం భారీ షాక్ తగిలింది. ఈ కంపెనీ విడుదల చేసిన బాండ్లపై వడ్డీ చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలో కంపెనీ ఈ వడ్డీ చెల్లించలేక దివాలా తీస్తుందని మదుపరులు ఆందోళనలో పడ్డారు. అంతే.. తమ పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. ఈ కారణంగానే సినిక్ హోల్డింగ్స్ సంపద భారీగా పతనమైంది.

చైనాలో సినిక్ హోల్డింగ్స్ ఒక్కటే కాదు, చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాయి. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం మొత్తం తీవ్రమైన సంక్షోభంలో ఉందనడం అతిశయోక్తేమీ కాదు. చైనాలో నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండె కూడా ఇలానే ఇబ్బందులు పడుతోంది. సంస్థ విస్తరణ కోసం విపరీతంగా అప్పులు చేసిన ఈ కంపెనీ.. వీటిని చెల్లించడానికి తిప్పలు పడుతోంది.

ఇలాంటి సమయంలో బాండ్లకు వడ్డీ చెల్లిస్తుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనిపై ఆధారపడిన చాలా రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా ఎవర్ గ్రాండె కారణంగా తిప్పలు పడుతున్నాయి. చైనా జీడీపీలో మూడో వంతు ఎవర్ గ్రాండె నుంచే వస్తుందంటేనే ఈ కంపెనీ ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ కంపెనీ దివాలా తీసే వరకూ పరిస్థితి రాదని, ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.