India: భారతీయులకు బ్రిటన్ లో క్వారంటైన్... దీటుగా స్పందించిన కేంద్రం

  • బ్రిటన్ లో కొత్త మార్గదర్శకాలు
  • వ్యాక్సిన్ తీసుకున్నవారికీ క్వారంటైన్
  • భారత్ సహా పలు దేశాల వారికి వర్తించేలా ఆంక్షలు
  • అసంతృప్తి వ్యక్తం చేసిన భారత్
  • నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని స్పష్టీకరణ
India warns Britain on new covid policy

కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారతీయులకు క్వారంటైన్ విధిస్తూ బ్రిటన్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేయడం కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. దీనిపై కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఇది వివక్ష తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. పూర్తిగా వివక్ష పూరితమైన విధానం అంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ నిబంధనలను ఉపసంహరించుకోకపోతే తమ నుంచి తీవ్ర ప్రతిచర్యను చవిచూడాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది.

ఓవైపు భారత్ లో తయారైన వ్యాక్సిన్ లను వాడుకుంటున్న బ్రిటన్, మరోవైపు అదే వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులపై ఆంక్షలు విధించడం సరికాదని హితవు పలికింది. కొవిషీల్డ్ ను అభివృద్ధి చేసింది బ్రిటన్ సంస్థలేనని, ఇప్పటికే అరకోటి కొవిషీల్డ్ డోసులను బ్రిటన్ కు అందించామని, ఆ వ్యాక్సిన్లకు అక్కడి ప్రజలకు వినియోగించారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడదే కొవిషీల్డ్ ను బ్రిటన్ గుర్తించకపోవడాన్ని వివక్షగానే భావిస్తామని స్పష్టం చేసింది.

దీనిపై బ్రిటన్ విదేశాంగ శాఖను వివరణ కోరామని, సానుకూల రీతిలో స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే, ప్రతిచర్య తీసుకునే హక్కు భారత్ కు ఉంటుందని వెల్లడించింది.

More Telugu News