Telangana: కాన్పు సమయంలో వైద్యుల నిర్లక్ష్యం.. మహిళ కడుపులో దూది మర్చిపోయిన వైద్యులు.. మహిళ మృతి!

Doctors forgets cotton in pregnant woman stomach
  • భువనగిరి జిల్లాలో వెలుగు చూసిన ఘోరం
  • కె.కె. ఆసుపత్రిలో ఏడాది క్రితం ప్రసవించిన మహిళ
  • కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న వైనం 
  • మరో ఆసుపత్రికి తీసుకెళ్తే బయటపడిన అసలు విషయం  
ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ గర్భంలో వైద్యులు దూది మర్చిపోయిన ఘటన భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భువనగిరి జిల్లాకు చెందిన ఒక మహిళ ఏడాది క్రితం ప్రసవం కోసం కె.కె. ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ చికిత్స చేయించుకున్న అనంతరం శిశువుకు జన్మనిచ్చింది.

కొన్నాళ్లకు ఆమె మరోసారి నెలతప్పింది. అంతా బాగానే ఉంది అనుకుంటుండగా ఇటీవలి కాలంలో ఆమెకు విపరీతంగా కడుపునొప్పి రావడం మొదలైంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమెకు కొన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. ఆ యువతి కడుపులో దూది ఉన్నట్లు గుర్తించారు. యువతి తొలి కాన్పు సమయంలోనే ఇది జరిగినట్లు వైద్యులు తెలిపారు.

ఆమె తొలి కాన్పు కోసం భువనగిరి జిల్లా కె.కె. ఆసుపత్రికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆ సమయంలోనే అక్కడి వైద్యులు ఆమె కడుపులో దూది మర్చిపోయారు. ఈ దూది కారణంగా గర్భిణి కడుపులో పేగులు బాగా దెబ్బతిన్నాయని హైదరాబాద్ డాక్టర్లు తెలిపారు. చికిత్స సమయంలో ఆమె మృతి చెందింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. గర్భిణికి తొలి కాన్పు చేసిన వైద్యుల ఇంటి ముందు నిరసనలు చేస్తున్నారు.
Telangana
Yadadri Bhuvanagiri District
Doctors
Pregnant Woman

More Telugu News