యాసిడ్ తో నాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు: హీరోయిన్ పాయల్ ఘోష్

21-09-2021 Tue 15:53
  • ముంబైలో పాయల్ ఘోష్ పై దుండగుల దాడి
  • ఐరన్ రాడ్ తగిలి కుడి చేతికి గాయం
  • రాత్రంతా నొప్పితో నిద్రపోలేదని ఆవేదన
Actress Payal Ghosh was attacked in Mumbai

సినీ నటి పాయల్ ఘోష్ పై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడి చేసేందుకు విఫల యత్నం చేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ముంబైలో మెడికల్ స్టోర్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మాస్కులు ధరించిన కొందరు వ్యక్తులు తనపై దాడికి యత్నించారని తెలిపింది. కారులోకి ఎక్కుతున్న సమయంలో ఐరన్ రాడ్డుతో దాడి చేశారని... దాడి చేసిన వారిలో ఒకరి చేతిలో గ్లాస్ బాటిల్ ఉందని... అందులో యాసిడ్ ఉందని తాను భావిస్తున్నానని చెప్పింది. ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని  తెలిపింది. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియోను పోస్ట్ చేసింది.

'మెడిసిన్స్ తెచ్చుకోవడానికి నిన్న బయటకు వెళ్లాను. ఆ తర్వాత నా కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబోతుండగా కొందరు నాపై దాడికి యత్నించారు. వారి చేతిలో గ్లాస్ బాటిల్ కూడా ఉంది. అది ఏమిటో నాకు తెలియకపోయినా... అందులో యాసిడ్ ఉందనేది నా అనుమానం. వాళ్లు నన్ను ఐరన్ రాడ్ తో కొట్టేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి తప్పించుకునేందును నేను ప్రయత్నించారు. గట్టిగా కేకలు వేశాను. దీంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. వారి ఐరన్ రాడ్ నా ఎడమ చేతికి తగిలి గాయమైంది.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా. నా జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదు. ముంబైలో తొలిసారి ఇలాంటి ఘటనను ఎదుర్కొన్నా. ఈ ఘటన జరిగినప్పటి నుంచి నాకు కంగారుగా ఉంది' అని పాయల్ తెలిపింది. నొప్పి వల్ల రాత్రంతా తాను నిద్రపోలేదని చెప్పింది. 'ప్రయాణం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పాయల్ ఘోష్ కథానాయికగా పరిచయం అయింది. 'ఊసరవెల్లి' సినిమాలో సహాయ నటిగా కూడా నటించింది.