రాహుల్ గాంధీ పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారు!: మల్లు రవి

21-09-2021 Tue 15:30
  • డ్రగ్స్ చుట్టూ రాజకీయాలు!
  • కేటీఆర్ కు వైట్ చాలెంజ్ విసిరిన రేవంత్ రెడ్డి
  • దమ్ముంటే డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలని సవాల్
  • పరువునష్టం దావా నిర్ణయం తీసుకున్న కేటీఆర్
  • కేటీఆర్ ది తెలివితక్కువ నిర్ణయమన్న మల్లు రవి
Congress leader Mallu Ravi comments on KTR

మంత్రి కేటీఆర్ డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైట్ చాలెంజ్ విసరడం, దీనిపై కేటీఆర్ పరువునష్టం దావా నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. అంతేకాదు, టెస్టులకు తాను సిద్ధమేనని, మరి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పి కేటీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి విసిరిన వైట్ చాలెంజ్ కు స్పందించకుండా, పరువు పోయింది అనడం తెలివితక్కువతనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

అయినా, కేటీఆర్... రాహుల్ గాంధీతో పోల్చుకోవడం తగదని అన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ, కేటీఆర్ ఎక్కడ? అంటూ మల్లు రవి వ్యాఖ్యానించారు. భూమ్యాకాశాలకు ఉన్నంత తేడా ఉందని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఇప్పటికైనా రేవంత్ విసిరిన వైట్ చాలెంజ్ ను స్వీకరించి, డ్రగ్స్ టెస్టుకు ముందుకు రావాలని సూచించారు.

మాదకద్రవ్యాల వాడకం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు రేవంత్ కృషి చేస్తున్నారని మల్లు రవి పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా వైట్ చాలెంజ్ ను స్వీకరించి, డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, తద్వారా తమ స్వచ్ఛత నిరూపించుకోవాలని అన్నారు.