కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్... ఇద్దరు పైలట్ల దుర్మరణం

21-09-2021 Tue 15:22
  • జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ క్రాష్
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు
  • గత నెలలో కూడా జమ్మూకశ్మీర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
2 Army Pilots Killed In Helicopter Crash In Jammu and Kashmir

జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన సంభవించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో హెలికాప్టర్ లోని ఇద్దరు పైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెలికి తీసిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించినప్పటికీ దురదృష్టవశాత్తు వారిని దక్కించుకోలేకపోయామని ఈ సందర్భంగా ఓ ఆర్మీ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. తుక్కుతుక్కయిపోయిన హెలికాప్టర్ నుంచి గాయపడ్డ పైలట్లను స్థానికులు బయటకు తీస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ స్పందిస్తూ, ఈ వార్త వినగానే చలించిపోయానని చెప్పారు. జమ్మూకశ్మీర్ లోని కథువాలో గత నెలలో కూడా హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రత్నసాగర్ డ్యామ్ లోకి ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది. పైలట్ ఆచూకీ ఇంత వరకు లభించలేదు.