ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పార్టీ ఎమ్మెల్యేకు కౌంటర్ ఇచ్చిన మార్గాని భరత్!

21-09-2021 Tue 14:39
  • మార్గాని భరత్ వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్న జక్కంపూడి రాజా
  • కొవ్వున్న నాయకులు తన గురించి మాట్లాడుతున్నారన్న భరత్
  • ఆయన మాదిరి తనకు చీకటి ఒప్పందాలు లేవని వ్యాఖ్య
YSRCP MP Margani Bharat fires on MLA Jakkampudi Raja

తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు బజారుకెక్కింది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు ఒకరిపై మరొకరు మీడియా ముఖంగా విమర్శించుకుంటున్నారు. తనపై ఎమ్మెల్యే జక్కంపూడి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందిస్తూ, తమ కుటుంబం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో సెల్ఫీలు తీసుకున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారనీ... రాజమండ్రిలో జరిగిన కాపు సమావేశంలో ఆయన తన పక్కన కూర్చొని మాట్లాడారని చెప్పారు. పార్లమెంటులో తాను బాగా మాట్లాడుతున్నానని లక్ష్మీనారాయణ తనతో అన్నారని తెలిపారు. జగన్ చాలా బాగా పాలిస్తున్నారని కూడా అన్నారని భరత్ చెప్పారు. ఆయనతో తాను సెల్ఫీ తీసుకోలేదని... వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుందని చెప్పారు.

చీకటి రాజకీయాలు ఎవరు చేస్తున్నారో అందరికీ తెలుసని భరత్ అన్నారు. పార్టీ లక్ష్మణరేఖను తాను దాటనని.. పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం తాను చేయనని అన్నారు. కొవ్వున్న నాయకులు కొందరు తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్ గారితో కుమ్మక్కై తాను రాజకీయాలు చేస్తున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అయితే 'మీ మాదిరి చీకటి ఒప్పందాలు తనకు లేవని' ఆయన అన్నారు. మీ చీకటి రాజకీయాలు స్కూలుకెళ్లే విద్యార్థులు, పోలీస్ కానిస్టేబుళ్ల నుంచి ప్రతి ఒక్కరికీ తెలుసని అన్నారు. తనను ఆర్ఆర్ఆర్ తో పోలుస్తున్నారని... అలాంటి రాజకీయాలు తాను చేస్తానా? అని అన్నారు.

టీడీపీ నేతలతో కుమ్మక్కై తనపై భరత్ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని జక్కంపూడి రాజా నిన్న మండిపడ్డారు. పార్టీకి నష్టం చేసేవారిని, కేసులు ఉన్న వారిని తాము దూరం పెడితే... మళ్లీ వారిని తీసుకొచ్చి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. భరత్ వల్ల పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఏర్పడుతోందని అన్నారు.