Fakhrizadeh: ఇరాన్ అణు శాస్త్రవేత్తను రోబో సాయంతో హత్య చేసిన ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్!

  • ప్రత్యేక శైలి కలిగిన మొస్సాద్
  • టార్గెట్ ఎక్కడున్నా ఛేదించే నైజం
  • ప్రపంచవ్యాప్తంగా బలమైన నెట్ వర్క్
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అండగా దాడులు
  • గుట్టు చప్పుడు కాకుండా స్పెషల్ ఆపరేషన్లు
Fakhrizadeh assassination details

ప్రపంచంలో అనేక దేశాలు స్వీయ గూఢచర్య వ్యవస్థలను నిర్వహిస్తుండడం తెలిసిందే. అమెరికా సీఐఏ, భారత్ రా, పాకిస్థాన్ ఐఎస్ఐ... ఇలా తమ దేశ భద్రతే పరమావధిగా పనిచేస్తుంటాయి. అయితే ఇవన్నీ ఒకెత్తయితే... ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ మరో ఎత్తు. సమస్యకు మూల కారణం వెతికి మరీ నిర్మూలించడం మొస్సాద్ ప్రత్యేకత. తమ దేశ విధానాలకు భంగకరం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి కచ్చితత్వంతో కూడిన దాడులు చేస్తుంది.

గత సంవత్సరం ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త ఫక్రిజాదే హత్య వెనుక కూడా మొస్సాద్ హస్తం ఉందని వెల్లడైంది. గతంలో ఈ సంస్థ నిర్వహించిన ఆపరేషన్లకు భిన్నంగా ఈసారి ఓ రోబో సాయంతో ఈ హత్య చేసినట్టు వెల్లడైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు ఎప్పటినుంచో తీవ్ర వ్యతిరేకత చూపుతున్నాయి. దాంతో ఎంతో భద్రత నడుమ ఇరాన్ గుట్టుగా తమ అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన అన్ని బాధ్యతలు ఫక్రిజాదేకు అప్పగించారు. అప్పట్నించే ఆయనను మొస్సాద్ టార్గెట్ చేసింది.

ఈ విషయం గుర్తించిన ఇరాన్ అధినాయకత్వం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కారు, రివల్యూషనరీ గార్డ్స్ తో సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అయితే, వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే ఫక్రిజాదే ఈ అదనపు భద్రత ఏర్పాట్లను పెద్దగా ఇష్టపడలేదు. ఇవన్నీ గమనించిన మొస్సాద్... ఫక్రిజాదే మర్డర్ కు తిరుగులేని విధంగా ప్లాన్ చేసింది.

బెల్జియం తయారీ ఎఫ్ఎన్ మాగ్ మెషీన్ గన్ కు రోబోటిక్ పరికరాలు అమర్చి, దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని జోడించింది. వీడియో ఫుటేజి ఉంటే చాలు... మనిషి అవసరం లేకుండానే గుళ్ల వర్షం కురిపించేలా ఆ రోబోను సిద్ధంచేసింది.

ఒకరోజు ఫక్రిజాదే తన కారులో ఓ పట్టణం వెళుతూ, తన భార్యను కూడా తీసుకెళ్లారు. ఆయనే స్వయంగా డ్రైవ్ చేస్తున్నారు. భార్య పక్క సీట్లో కూర్చుంది. వెనుక కొద్దిదూరంలో సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు వస్తున్నాయి. ఫక్రిజాదే కదలికలను అత్యంత కచ్చితత్వంతో గుర్తించేందుకు మొస్సాద్ అక్కడక్కడ కొన్ని కెమెరాలు ఏర్పాటు చేసింది. ఈ కెమెరాల నుంచి సేకరించిన ఫుటేజిని కిల్లర్ రోబో విశ్లేషించి, లక్ష్యాన్ని ఛేదించేలా ప్లాన్ రూపొందించారు. ఇక, ఫక్రిజాదే తన కారులో  కొద్దిదూరం వెళ్లారో లేదో మూడు సార్లు కాల్పుల శబ్దం వినిపించింది.

సీన్ కట్ చేస్తే... ఫక్రిజాదే రక్తపుమడుగులో కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న ఆయన భార్యకు ఒక్క బుల్లెట్ కూడా తగల్లేదు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అక్కడంతా వెదికినా ఒక్క మనిషి జాడ కూడా లేదు. ఇంతలో అక్కడ నిలిపి ఉంచిన ఓ ట్రక్కు పేలిపోయింది. ఆ ట్రక్కులోనే కిల్లర్ రోబో ఉందన్న విషయం ఆ సమయంలో ఇరాన్ కమాండోలకు తెలియలేదు.

అనంతరం ఆ ట్రక్కులో పేలిపోయిన భాగాలను పరిశీలిస్తే, అప్పుడుగానీ తెలియలేదు అది మొస్సాద్ పని అని. కానీ, విదేశీ గూఢచర్య సంస్థ తమ దేశంలోకి వచ్చి దాడి చేస్తే, అది తమ వైఫల్యమే అవుతుందని భావించిన ఇరాన్ అధినాయకత్వం పరువు కాపాడుకునేందుకు ఈ ఘటనపై మౌనం దాల్చింది.

More Telugu News