యాక్టింగ్​ లో అదరగొట్టేసిన బల్లెం వీరుడు నీరజ్​ చోప్రా.. యాడ్​ వీడియో ఇదిగో!

21-09-2021 Tue 14:18
  • క్రెడ్ ప్రకటనలో వివిధ అవతారాలు
  • బిజినెస్ మ్యాన్ గా, బ్యాంక్ అధికారిగా, రిపోర్టర్ గా రూపాంతరం
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ప్రకటన
Netizens Admire Neeraj Chopra Acting Skills

ఇటీవల జరిగిన ఒలింపిక్స్ లో జావెలిన్ త్రో క్రీడలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. ఎందరికో ఆదర్శంగానూ నిలిచాడు. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్ సంచలనంగా మారాడు ఆ 23 ఏళ్ల బల్లెం వీరుడు. అవును మరి, ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. తనలోని నటుడిని నెటిజన్లకు పరిచయం చేశాడు. ఓ ప్రకటనలో ఈ స్టార్ మెరిసిపోయాడు.  

క్రెడ్ తాజాగా రూపొందించిన ప్రకటనలో ఓ రిపోర్టర్ గా, బిజినెస్ మ్యాన్ గా, సినీ దర్శకుడిగా, బ్యాంక్ అధికారిగా రూపాంతరం చెందాడు. అంతేకాదు.. జావెలిన్ త్రో ఔత్సాహికుడిగానూ కనిపించాడు. అసలు అతడు నీరజ్ చోప్రానేనా అనేంతగా మారిపోయాడు. ఇప్పుడు ఈ ప్రకటన వీడియో వైరల్ అవుతోంది. తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ ప్రకటనను నీరజ్ చోప్రాతో పాటు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు షేర్ చేశారు. నెటిజన్లూ ఆ ప్రకటనకు ఫిదా అయిపోతున్నారు. చాలా మంది బాలీవుడ్ స్టార్ల కన్నా కూడా నీరజ్ యాక్టింగ్ స్కిల్స్ అదరహో అనిపించేలా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు.