ఆఫ్ఘన్​ నుంచి ఆంధ్రాకు డ్రగ్స్​ ఎలా వస్తున్నాయంటూ ప్రశ్నించిన రఘురామకృష్ణరాజు

21-09-2021 Tue 13:56
  • హెరాయిన్ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు 
  • గతంలో విజయవాడకు షిప్ మెంట్లు వచ్చాయని ఆరోపణ
  • ఆ సొమ్ము ఎలాంటి అసాంఘిక పనులకు వాడుతున్నారని ప్రశ్న
  • ఏపీలో సినీ పరిశ్రమ టర్నోవర్ రూ.1,200 కోట్లు అన్న ఎంపీ
Raghu Rama Fires On AP Government Over Drugs Issue

గుజరాత్ తీరంలో రూ.9 వేల కోట్ల హెరాయిన్ దొరకడం, దానికి ఆంధ్రాతో సంబంధాలుండడంపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. విజయవాడ, రాజధానిలో ఇంతకుముందు నుంచే డ్రగ్స్ మూలాలున్నాయని సంచలన ఆరోపణ చేశారు. కేవలం ఈ రెండు నెలల నుంచే అలికిడి లేదన్నారు. గతంలో కొన్ని షిప్ మెంట్లు రావడం, పోవడం జరిగిందన్నారు.

తాలిబన్లకు కేంద్రమైన ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆంధ్రాకు డ్రగ్స్ ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఆ సొమ్మును ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు. అయితే విజయవాడ కమిషనర్ మాత్రం ఆ సమస్యను తీసిపారేశారని, కొంచెం తీవ్రంగా దానిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు.

డ్రగ్స్ కాకినాడ పోర్టుకు ఎందుకొచ్చాయి? విజయవాడకు ఎలా వచ్చాయి? అన్న దానిపై సీఎం జగన్ విచారణ జరిపించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీల దగ్గర డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరుగుతోందని, కాబట్టి పిల్లల భవిష్యత్ దృష్ట్యా సీఎం జగన్ వెంటనే స్పందించాలని కోరారు.

కాగా, సినిమా ఇండస్ట్రీని మటన్, ఉప్పుతో రఘురామ పోల్చారు. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే ఆదాయం కొంతే అయినా.. అది కూరలో ఉప్పులాంటిదని చెప్పుకొచ్చారు. మటన్ కిలో రూ.800 పెట్టి కొనుగోలు చేస్తామని, ఉప్పు కిలో రూ.10 అని అన్నారు. అయినా కూడా ఆ ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో తెలిసిందేనని అన్నారు. సినిమా ఇండస్ట్రీ కూడా అలాంటిదేనన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ టర్నోవర్ రూ.1,200 కోట్లకు మించి లేదని, తాను సినీ పెద్దలతో మాట్లాడి ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. టికెట్ పై సగటున 14 శాతం జీఎస్టీ వేసినా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం కేవలం రూ.100 కోట్లేనన్నారు.

సినీ వినోదం ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొంటూ ప్రకటనలు చేయడం మానుకోవాలని అన్నారు. మరి, పొద్దంతా పనిచేసి వచ్చి ఓ సామాన్యుడు తాగే క్వార్టర్ మందును రూ.50 నుంచి రూ.250కి పెంచినప్పుడు ఆ విషయం గుర్తురాలేదా? అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో టికెట్ రేట్లు రూ.25 నుంచి రూ.30 ఉన్న థియేటర్లు మనగలగాలంటే ధరలను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపైనా ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీలో 1100 థియేటర్లున్నాయని, ఒక్కో థియేటర్ కు ఒక్కో ఖాతాను ప్రభుత్వం ఓపెన్ చేసి పర్యవేక్షణ చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అసలు అది అవసరమా? అని నిలదీశారు.