Sharmila: రోడ్డుపై బైఠాయించిన ష‌ర్మిల, కార్య‌క‌ర్త‌లు... అరెస్టు.. తీవ్ర ఉద్రిక్త‌త‌

  • నిరుద్యోగ దీక్ష‌కు బ‌య‌లుదేరిన ష‌ర్మిల‌
  • బోడుప్ప‌ల్ వ‌ద్ద అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, వైఎస్సార్‌టీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వివాదం
  • మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు ష‌ర్మిల త‌ర‌లింపు
sharmila slams kcr

వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు షర్మిల ప్ర‌తి మంగ‌ళ‌వారం చేస్తున్న‌ నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో దీక్ష చేప‌ట్టాల‌ని భావించ‌గా, అందుకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ ఆమె అక్క‌డ‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. హైద‌రాబాద్ బోడుప్ప‌ల్‌లో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ష‌ర్మిల‌, ఆమె మ‌ద్ద‌తుదారులు, వైఎస్సార్‌టీపీ కార్య‌క‌ర్త‌లు రోడ్డుపైనే బైఠాయించారు.

దీంతో పోలీసులు, వైఎస్సార్‌టీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వివాదం, తోపులాట‌లు చోటు చేసుకున్నాయి. అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. చివ‌ర‌కు ష‌ర్మిల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మేడిప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంతరం ఘటకేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు ఆమెను తరలించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు వ్య‌తిరే‌కంగా ష‌ర్మిల‌తో పాటు ఆమె మ‌ద్ద‌తుదారులు నినాదాల‌తో హోరెత్తించారు. పోలీసుల జులుం న‌శించాలంటూ ష‌ర్మిల పోలీసుల కారులోనూ నినాదాలు చేశారు. శాంతియుతంగా దీక్ష చేసేందుకు వ‌చ్చిన త‌మ‌ను ఎందుకు అరెస్టు చేస్తున్నార‌ని ఆమె నిల‌దీశారు.

More Telugu News