భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ వచ్చిన తర్వాత శిల్పా శెట్టి తొలి స్పందన

21-09-2021 Tue 12:08
  • పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా
  • దాదాపు రెండు నెలల పాటు జైల్లో గడిపిన కుంద్రా
  • ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం
Shilpa Shettys First Post After Husband Raj Kundra Gets Bail
ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ ఫిలిం కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ అంశం బాలీవుడ్ ను షాక్ కు గురి చేసింది. మరోవైపు తన భర్త ఏమేం చేస్తున్నారో తనకు తెలియదని... తన షూటింగుల్లో తాను బిజీగా ఉంటానని పోలీసులకు శిల్పాశెట్టి తెలిపింది. ఇదే విషయాన్ని వారు తమ ఛార్జిషీట్లలో కూడా పొందుపరిచారు. మరోవైపు రాజ్ కుంద్రాకు నిన్న ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఈరోజు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలల పాటు రాజ్ కుంద్రా జైల్లో ఉన్నారు.

రాజ్ కుంద్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత శిల్పాశెట్టి ఇన్స్టాగ్రామ్ ద్వారా తొలిసారి స్పందించారు. ప్రముఖ చైనీస్ అమెరికన్ అర్కిటెక్ట్ రోగర్ లీ కొటేషన్ ను ఆమె పోస్ట్ చేశారు. 'చెడు తుపాను తర్వాత కూడా అందమైన విషయాలు జరుగుతాయని నిరూపించడానికే ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది' అనే కొటేషన్ ను షేర్ చేశారు. 2009లో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా పెళ్లి చేసుకున్నారు. దశాబ్దకాలానికి పైగా సంతోషకర వైవాహిక జీవితాన్ని అనుభవించిన తర్వాత... పోర్నోగ్రఫీ కేసు వారి బంధంలో ప్రకంపనలు సృష్టించింది. శిల్పాశెట్టి తన భర్తకు దూరంగా జీవించబోతోందనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. వారిరువురి అనుబంధం ఎలా ఉండబోతోందో రాబోయే కాలమే నిర్ణయించాలి.