కేంద్రంలో మళ్లీ మోదీ పాలనే వస్తుంది... కానీ, కర్ణాటకలో బీజేపీ రావాలంటే ఇది తప్పనిసరి: యడియూరప్ప

21-09-2021 Tue 11:30
  • కర్ణాటకలో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నిక
  • యడ్డీ సీఎంగా వైదొలగిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు
  • రాష్ట్ర బీజేపీకి అగ్ని పరీక్ష కాబోతున్న ఎన్నికలు
Modi wave only not enough to win in Karnataka says Yediyurappa

కర్ణాటక బీజేపీకి పరీక్ష ఎదురుకాబోతోంది. ముఖ్యమంత్రి పదవి నుంచి యడియూరప్ప తప్పుకున్న తర్వాత ఆ రాష్ట్రంలో తొలిసారి ఉపఎన్నికలు జరగబోతున్నాయి. సిందగీ, హనేగల్ నియోజకవర్గాలు ఉపఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. యడ్డీ తప్పుకున్నాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే బీజేపీకి ఈ ఉపఎన్నికలు అగ్నిపరీక్ష వంటివి.

ఈ నేపథ్యంలో యడియూరప్ప మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీ గెలవాలంటే మోదీ వేవ్ ఒక్కటే సరిపోదని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులే గెలుపు, ఓటములను నిర్ణయిస్తాయని అన్నారు.

కేంద్రంలో మళ్లీ మోదీ పాలనే వస్తుందని... కానీ కర్ణాటకలో బీజేపీ విజయం సాధించాలంటే అభివృద్ధి తప్పనిసరి అని యడ్డీ చెప్పారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నిద్ర లేచిందని, ఆ పార్టీని చిత్తు చేయాలంటే అభివృద్ధి ఒక్కటే మార్గమని అన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.