బైక్‌పై వెళుతుండగా పిడుగుపాటు.. తల్లీకొడుకుల మృత్యువాత

21-09-2021 Tue 08:31
  • మంచిర్యాలలో ఘటన
  • కుమారుడిని ఆసుపత్రిలో చూపించి వస్తుండగా పడిన పిడుగు
  • చెల్లాచెదురుగా పడిపోయిన భర్త, భార్య, కుమారుడు
  • భర్త పరిస్థితి కూడా విషమం
Lightnig takes two lives in Mancherial District

బైక్‌పై వెళ్తున్న తల్లీ కుమారులను పిడుగుపాటు బలితీసుకుంది. మంచిర్యాలలో నిన్న జరిగిన ఈ ఘటన పెను విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన పి.వెంకటేశ్ (35), మౌనిక (27) భార్యాభర్తలు. కుమారులు విశ్వతేజ (5), 18 నెలల శ్రేయాన్‌తో కలిసి మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని సీసీసీలో నివాసం ఉంటున్నారు. వెంకటేశ్ కారు డ్రైవర్.

శ్రేయాన్ అనారోగ్యానికి గురి కావడంతో పెద్ద కుమారుడు విశ్వతేజను అమ్మమ్మ వద్ద దించిన వెంకటేశ్.. నిన్న ఉదయం భార్య, చిన్నకుమారుడితో కలిసి బైక్‌పై ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ శ్రేయాన్‌ను చూపించిన అనంతరం వర్షంలో తడుస్తూనే ఇంటికి బయలుదేరారు. రైల్వే వంతెన వద్దకు వచ్చే సరికి వారి బైక్‌కు సమీపంలో భారీ శబ్దంతో పిడుగు పడడంతో వారు ముగ్గురూ చెల్లాచెదురుగా పడిపోయారు.

గమనించిన స్థానికులు వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లీకుమారులు మరణించినట్టు నిర్ధారించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంకటేశ్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.