తమకు న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియోలో జగన్‌ను కోరిన అక్బర్ బాషా కుటుంబం ఆత్మహత్యాయత్నం

21-09-2021 Tue 06:59
  • తన ఎకరంన్నర భూమిని వైసీపీ నేత తిరుపేల రెడ్డి ఆక్రమించారని అక్బర్ బాషా ఆరోపణ
  • న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని సెల్పీ వీడియో
  • సీఎం కార్యాలయం చెప్పినా భూమిని అప్పగించని తిరుపేలరెడ్డి
  • పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
akbar basha family attempted suicide
తనకున్న ఎకరంన్నర భూమిని వైసీపీ నేత తిరుపేలరెడ్డి కుటుంబం ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకుందని, తిరుపేలరెడ్డి చెప్పినట్టు వినకపోతే ఎన్‌కౌంటర్ చేస్తానని మైదుకూరు రూరల్ సీఐ కొండారెడ్డి తమను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించారని, సోమవారం సాయంత్రంలోగా తమకు న్యాయం చేయకపోతే కుటుంబ సభ్యులం నలుగురం కలిసి ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇటీవల సెల్ఫీ వీడియో తీసి జగన్‌ను అభ్యర్థించిన అక్బర్ బాషా కుటుంబం అనుకున్నట్టే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం వీరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషాకు కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లిలో ఎకరంన్నర భూమి ఉంది. ఈ భూమిని వైసీపీ నేత తిరుపేలరెడ్డి ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు అక్బర్ బాషా ఆరోపిస్తూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. స్పందించిన కడప ఎస్పీ అన్బురాజన్ బాధిత కుటుంబాన్ని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. అక్బర్ బాషా భూమిని తిరిగి అప్పగించాలని తిరుపేల రెడ్డికి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి.

అయినప్పటికీ ఆయన ఆ భూమిని అప్పగించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అక్బర్ బాషా.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వారిని వెంటనే చాగలమర్రిలోని కేరళ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన చాగలమర్రి, దువ్వూరు పోలీసులు ఆసుపత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు.

అక్బర్ బాషా కుటుంబానికి ప్రాణాపాయం లేదని ఎస్పీ తెలిపారు. వివాదాస్పద ఎకరంన్నర భూమి అక్బర్‌బాషా అత్త ఖాసింబీదిగా తేలుస్తూ 2018లోనే మైదుకూరు కోర్టు తీర్పు ఇచ్చిందని ఎస్పీ తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే రెవెన్యూ కోర్టులోనే తేల్చుకోవాలని సూచించారు. సివిల్ విషయాల్లో తలదూర్చడం సరికాదని పోలీసులకు సూచించారు.