USA: అమెరికా కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులపై నిషేధం ఎత్తివేత!

US To Lift Covid Travel Ban For Fully Vaccinated Passengers From November
  • నవంబరులో అంతర్జాతీయ ప్రయాణాలనై నిషేధం ఎత్తేయనున్న అమెరికా
  • ఐరోపా దేశాల నుంచి భారీగా వస్తున్న డిమాండ్
  • 18 నెలల క్రితం ట్రంప్ హయాంలో మొదలైన ట్రావెల్ బ్యాన్
అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయిన పక్షంలో వారికి అనుమతులు ఇస్తామని ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో గడిచిన 18 నెలలుగా అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధం కొనసాగుతోంది. ఈ నిషేధాన్ని నవంబరు నెలలో తొలగించాలని బైడెన్ సర్కారు నిర్ణయించింది.

ఈ విషయాన్ని బైడెన్ ప్రభుత్వంలో కరోనా రెస్పాన్స్ కోఆర్డినేటర్‌గా ఉన్న జెఫ్రీ జియెంట్స్ వెల్లడించారు. ట్రంప్ హయాంలో విధించిన ఈ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాన్ని నవంబరులో తొలగిస్తామని జెఫ్రీ తెలిపారు. అయితే కరోనా నియంత్రణ కోసం పలు భద్రతా చర్యలు మాత్రం అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. విదేశాల నుంచి అమెరికా వచ్చే ప్రయాణికుల వ్యాక్సినేషన్ పూర్తయ్యి ఉండాలని చెప్పారు.

అయితే ఈ కొత్త నిబంధనలు కేవలం అమెరికాలో గ్రీన్ సిగ్నల్ లభించిన వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయా? లేక ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఫర్వాలేదా? అనే అంశంపై ఎటువంటి స్పష్టత జెఫ్రీ ఇవ్వలేదు. కాగా, అమెరికాలో గతేడాది కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పుంజుకోవడంతో కరోనా పరిస్థితి అదుపులోకి వచ్చినట్లే కనిపించింది. కానీ వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడం, దానికితోడు డెల్టా వేరియంట్ విజృంభించడంతో మరోసారి అమెరికా అల్లాడుతోంది. ఇప్పటి వరకూ అమెరికాలో 6,70,000 మందికి పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.
USA
Vsccination
Travel Ban
White House
Joe Biden

More Telugu News