ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లో పాసై పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న యువతికి కేటీఆర్ చేయూత

20-09-2021 Mon 21:27
  • ఓ దినపత్రికలో కథనం
  • అధికారుల ద్వారా తెలుసుకున్న కేటీఆర్
  • వెంటనే స్పందించిన వైనం
  • జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గా ఉద్యోగం
  • కన్నీటిపర్యంతమైన యువతి
KTR responds to a media story and helps a well educated sanitary worker

ఆమె పేరు రజని. ఎమ్మెస్సీ ఫస్ట్ క్లాస్ లో పాసై పరిస్థితుల కారణంగా పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. అయితే ఓ దినపత్రికలో ఆమెపై కథనం రావడంతో మంత్రి కేటీఆర్ స్పందించి ఆమెకు ఉద్యోగం కల్పించారు. రజని స్వస్థలం వరంగల్ జిల్లా పరకాల ప్రాంతం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఎంతో కష్టపడి విద్యాభ్యాసం చేసిన రజని 2013లో ఎమ్మెస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత పీహెచ్ డీ చేసేందుకు అవకాశం వచ్చినా, ఇంతలో పెళ్లి కావడంతో భర్తతో కలిసి హైదరాబాద్ చేరుకుంది. ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. రజని భర్త న్యాయవాది.

అయితే అతను హృద్రోగానికి గురికావడంతో మూడుసార్లు స్టెంట్లు వేశారు. దాంతో న్యాయవాద వృత్తికి దూరమయ్యాడు. కుటుంబ పోషణ భారం రజనిపై పడింది. ఉద్యోగం దొరక్కపోవడంతో సంతల్లో కూరగాయలు కూడా అమ్మిన రజని... చివరికి రూ.10 వేల జీతానికి జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా విధుల్లో చేరింది.

ఆమె దయనీయ గాథ ఓ దినపత్రికలో రాగా, అధికారుల ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిసింది. ఆయన వెంటనే స్పందించి, రజనిని తన కార్యాలయానికి ఆహ్వానించారు. ఆమె ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిందని తెలుసుకుని, ఆమె విద్యార్హతలకు తగిన విధంగా జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ గా కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. కేటీఆర్ స్పందన పట్ల రజని తీవ్ర భావోద్వేగాలకు లోనైంది.