అమెరికా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ సంభాషణ

20-09-2021 Mon 20:39
  • ఆఫ్ఘనిస్థాన్ సహా పలు అంశాలపై చర్చ
  • ట్విట్టర్ వేదికగా వెల్లడించిన రాజ్‌నాథ్ సింగ్
  • కొన్నిరోజుల్లో అమెరికా వెళ్లనున్న ప్రధాని మోదీ
Rajnath speaks to US Defense Secretary on telephone

భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో ఫోన్‌లో సంభాషించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంపై తామిద్దరూ చర్చించుకున్నట్లు రాజ్‌నాథ్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ సహా పలు స్థానిక అంశాలపై కూడా ఈ రక్షణ మంత్రులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

తమ మధ్య సంభాషణ బాగా జరిగిందని, కొన్ని ప్రాంతీయ అంశాలపై కూడా మాట్లాడుకున్నామని రాజ్‌నాథ్ వెల్లడించారు. ఇరుదేశాలకు లాభదాయకమైన విషయాలపై చర్చించుకోవడంతోపాటు, తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు అంగీకారం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ వారంలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో రాజ్‌నాథ్, లాయిడ్ ఆస్టిన్ మధ్య సంభాషణ జరగడం గమనార్హం.