అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిల్

20-09-2021 Mon 20:17
  • అశ్లీల చిత్రాల కేసులో జులై 19న అరెస్ట్
  • ఇటీవల చార్జిషీటు దాఖలు చేసిన పోలీసులు
  • బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న రాజ్ కుంద్రా
  • ఊరటనిచ్చిన ముంబయి కోర్టు
Mumbai court issues bail to Raj Kundra

అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ అయిన నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. రూ.50 వేల పూచీకత్తుతో ముంబయి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అశ్లీల చిత్రాలు నిర్మించడం, వాటిని విక్రయించడం వంటి ఆరోపణలతో రాజ్ కుంద్రాను పోలీసులు జులై 19న అరెస్ట్ చేశారు. ఇటీవలే రాజ్ కుంద్రాపై ముంబయి పోలీసులు 1,400 పేజీల భారీ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రాజ్ కుంద్రా బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని, చార్జిషీటు కూడా దాఖలు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇకనైనా తనకు బెయిల్ మంజూరు చేయాలని అర్థించారు. అసలు ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారని వాపోయారు.

అయితే, ఈ కేసులో ముఖ్యుడు రాజ్ కుంద్రానే అని, మరికొందరు వ్యక్తులతో కలిసి యువతులను మభ్యపెట్టి అశ్లీల చిత్రాల రొంపిలోకి దించేవారని పోలీసులు చార్జిషీటులో పేర్కొన్నారు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడేవారిని గుర్తించి, అశ్లీల చిత్రాల వైపు మళ్లించేవారని ఆరోపించారు.

ఏదేమైనా రాజ్ కుంద్రాకు బెయిల్ లభించింది. అయితే, ఈ తీవ్రమైన కేసు నేపథ్యంలో శిల్పాశెట్టితో రాజ్ కుంద్రా వైవాహిక జీవితం మునుపటిలా సజావుగా సాగుతుందా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.