నాకంటే రానానే బీభత్సంగా ఉన్నాడు: మలయాళ నటుడు పృథ్వీరాజ్

20-09-2021 Mon 19:12
  • మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియుమ్
  • తెలుగులో భీమ్లానాయక్ గా రీమేక్
  • మలయాళంలో కోషీ పాత్ర పోషించిన పృథ్వీరాజ్
  • తెలుగులో ఆ పాత్రను చేస్తున్న రానా
Malayalam actor Prithviraj Sukumaran responds on Daniel Shekar

కేరళలో గతేడాది రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయిన చిత్రం అయ్యప్పనుమ్ కోషియుమ్. అందులో కోషీ కురియన్ అనే రౌడీగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఇప్పుడా పాత్రనే తెలుగులో రానా పోషిస్తున్నాడు. అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని పవన్ కల్యాణ్ హీరోగా తెలుగులో భీమ్లా నాయక్ గా తెరకెక్కిస్తుండగా, రానా పోషించిన డేనియల్ శేఖర్ పాత్రకు సంబంధించిన టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను మలయాళ నటుడు పృథ్వీరాజ్ కూడా చూశారు. అనంతరం సోషల్ మీడియాలో తన స్పందన వెలిబుచ్చారు.

"అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం నా కెరీర్ లోనే ఎంతో ప్రత్యేకమైన చిత్రం. అనేక కారణాల రీత్యా వ్యక్తిగతంగానూ ఆ చిత్రం నాకు విశిష్టమైనది. నేను పోషించిన పాత్రల్లో కోషీ కురియన్ పాత్ర కూడా అత్యుత్తమంగా నిలిచిపోతుంది. అయ్యప్పనుమ్... దర్శకుడు సచీ నేను కూడా ఈ సినిమా రీమేక్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ తెలుగులో దిగ్గజాల వంటి నటులు ఈ సినిమా రీమేక్ చేస్తారని మేం ఏమాత్రం ఊహించలేదు. పవన్ కల్యాణ్ సర్, త్రివిక్రమ్ సర్, రవి కె చంద్రన్, తమన్ వంటి ప్రముఖులు ఈ సినిమా కోసం పనిచేస్తుండడంతో ఇది మామూలు రేంజి సినిమా కాదని అర్థమైపోయింది.

అయితే నాకు అన్నిటికంటే సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే... నేను మలయాళంలో పోషించిన కోషీ కురియన్ పాత్రను తెలుగులో నా సోదరుడు, ప్రియమిత్రుడు రానా దగ్గుబాటి పోషిస్తుండడమే. సోదరా.... నువ్వు నాకంటే బీభత్సంగా ఉన్నావు. రౌద్రం ఉట్టిపడేలా కనిపిస్తున్నావు. ఈ విధంగా మాత్రం నేను ఎప్పుడూ చేయలేదు" అని పృథ్వీరాజ్ వివరించారు. అంతేకాదు, రానా తాజా లుక్ పోస్టర్ ను, డేనియల్ శేఖర్ పరిచయ వీడియోను పంచుకున్నారు.