అందరం ఎందుకు... నువ్వూ, నేనూ రాజీనామా చేసి తేల్చుకుందాం.. రా!: అచ్చెన్నకు బొత్స సవాల్

20-09-2021 Mon 16:21
  • ప్రభుత్వాన్ని రద్దు చేయాలని అచ్చెన్న డిమాండ్
  • మళ్లీ ఎన్నికలకు పోదామని వ్యాఖ్యలు
  • అచ్చెన్న వ్యాఖ్యలను ఖండించిన బొత్స
  • ఇవేమన్నా కుస్తీ పోటీలా? అంటూ విమర్శలు
Botsa responds to Atchannaidu comments

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. అచ్చెన్నాయుడు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే, తాను కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందామని అన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ అదేపనిగా డిమాండ్ చేయడం సరికాదని హితవు పలికారు.

"అందరూ రాజీనామా చేయడం ఎందుకు? నువ్వు, నేను రాజీనామా చేద్దాం రా. నాకు ఈ సవాళ్లు నచ్చవు. దమ్ముంటే చూసుకుందాం రా, దమ్ముంటే కొట్టుకుందాం రా అనడానికి ఇవేమన్నా కుస్తీ పోటీలా?" అని వ్యాఖ్యానించారు. ఎన్నికల బహిష్కరణ అంటూ అచ్చెన్నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

ముందు, ఓటమిని అంగీకరించడం టీడీపీ నేర్చుకోవాలని సూచించారు. టీడీపీ నేతల మాటలు చూస్తుంటే వారికి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదన్న విషయం అర్థమవుతోందని బొత్స విమర్శించారు. టీడీపీ పనైపోయిందన్న సంగతి స్పష్టమైందని, ఏపీ ప్రజలు సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు.