Budda Venkanna: మేము ఫిర్యాదు చేస్తే.. మాపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెడతారా?: బుద్ధా వెంకన్న

Budda Venkanna anger on police for filing cases on them
  • చంద్రబాబు ఇంటిపై జోగి రమేశ్ దాడికి యత్నించారు
  • కొందరు పోలీసులు ప్రమోషన్ల కోసం వైసీపీకి ఊడిగం చేస్తున్నారు
  • దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలకు రండి
టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న తమపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడం దారుణమని ఆ పార్టీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ చంద్రబాబు ఇంటిపై దాడి చేసేందుకు వచ్చారని... వారి ప్రయత్నాన్ని తామంతా కలిసి అడ్డుకున్నామని చెప్పారు. వైసీపీ వాళ్ల దాడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. చంద్రబాబు నివాసంపై దాడికి వచ్చిన వాళ్లపై కేసులు పెట్టకుండా, తమపై కేసులు పెట్టడం ఏమిటని మండిపడ్డారు. పోలీసులు నిజాయతీగా పని చేయాలని కోరారు.

కొంత మంది పోలీసులు ప్రమోషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని వెంకన్న దుయ్యబట్టారు. పోలీసు అధికారుల సంఘం దీన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చత్తీస్ గఢ్ మాదిరి పోలీసులపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. కొంత మంది పోలీసు అధికారులు చేస్తున్న తప్పుకు పోలీస్ వ్యవస్థ మొత్తం నింద మోయాల్సి వస్తోందని అన్నారు. ఏపీ పోలీసు అంటే సినిమా పోలీసు అనే అపవాదు మూటకట్టుకున్నారని విమర్శించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని వెంకన్న చెప్పారు. దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలకు రావాలని... టీడీపీ ఓడిపోతే పార్టీని మూసేస్తామని సవాల్ విసిరారు. పోలీసులు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా? అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనకు ఒక వినతిపత్రాన్ని ఇస్తామని... అమరావతిలో ఒక వంద ఎకరాల్లో పిచ్చాసుపత్రి కట్టించాలని కోరుతామని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో చాలా మందికి పిచ్చెక్కిందని, వారందరినీ ఆ పిచ్చాసుపత్రిలో చేర్పించి, చికిత్స అందజేయాలని కోరుతామని అన్నారు.
Budda Venkanna
Telugudesam
YSRCP
Police

More Telugu News