Revanth Reddy: మధ్యాహ్నం 12 గంటలకు రా అంటూ రేవంత్ సవాల్.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. హీటెక్కిన ట్విట్టర్

  • డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్, కేటీఆర్ ల మధ్య ఛాలెంజ్ లు
  • రాహుల్ గాంధీ వస్తే తాను టెస్టుకు సిద్ధమన్న కేటీఆర్
  • ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమా అంటూ రేవంత్ కు ఛాలెంజ్
KTRs hot response to Revanth Reddys challenge

టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరూ ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. డ్రగ్స్ వాడేవారికి కేటీఆర్ బ్రాండ్ అంబాసడర్ అంటూ రేవంత్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సమాధానంగా నార్కోటిక్ పరీక్షలు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టు చేయించుకుంటే, తాను కూడా చేయించుకుంటానని సవాల్ విసిరారు.

ఈ క్రమంలో ఈరోజు రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా సవాల్ విసిరారు. దేశంలోని యువతకు డ్రగ్స్ పై అవగాహన కలిగించేందుకు తాను, కొండా విశ్వేశ్వర్ రెడ్డి కలిసి వైట్ ఛాలెంజ్ ను ప్రారంభించామని... ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇద్దరం కలిసి కేటీఆర్ కోసం వేచి చూస్తుంటామని ట్వీట్ చేశారు.

రేవంత్ ట్వీట్ కు కేటీఆర్ అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఢిల్లీలో ఎయిమ్స్ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోవడానికి తాను సిద్ధమని... రాహుల్ గాంధీ కూడా టెస్టులకు రావాలని సవాల్ విసిరారు. చర్లపల్లి జైల్లో గడిపిన వ్యక్తులతో సవాల్ స్వీకరించడం తన స్థాయికంటే చాలా తక్కువని అన్నారు. నార్కోటిక్ పరీక్షల్లో తనకు క్లీన్ చిట్ వస్తే... బేషరతుగా క్షమాపణలు చెప్పి, పదవులకు రాజీనామా చేస్తారా? అని ఛాలెంజ్ చేశారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కొనేందుకు మీరు సిద్ధమా? అని సవాల్ చేశారు. వీరిద్దరి ఛాలెంజ్ లతో ఈరోజు ట్విట్టర్ హీటెక్కింది.

More Telugu News