కొనసాగుతున్న నిమజ్జనం.. గణనాథులతో ట్యాంక్‌బండ్ ఫుల్!

20-09-2021 Mon 07:43
  • నగరంలో నిన్న ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం
  • వర్షం కారణంగా ఆలస్యమైన నిమజ్జనోత్సవం
  • ట్యాంక్‌బండ్‌పై ఇంకా పదుల సంఖ్యలో వినాయక ప్రతిమలు
Ganesh Immersion Continue in Hyderabad Tank Bund

హైదరాబాద్‌‌లో నిన్న వైభవంగా ప్రారంభమైన గణేశ్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. ట్యాంక్‌బండ్‌పై గణేశ్ విగ్రహాలు పదుల సంఖ్యలో బారులు తీరి, తమ వంతు కోసం ఎదురుచూస్తున్నాయి. నిన్న సాయంత్రం అకస్మాత్తుగా వర్షం ప్రారంభం కావడంతో నిమజ్జనం ఆలస్యమైంది. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్‌‌పై గణనాథులు నెమ్మదిగా ముందుకు కదులుతున్నారు.

 మరోవైపు, బషీర్‌బాగ్, గన్‌ఫౌండ్రీ వైపు కూడా గణనాథులు నిమజ్జనానికి వెళ్తున్నారు. 10 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న విగ్రహాలను ట్యాంక్‌బండ్‌వైపు, అంతకంటే తక్కువ ఎత్తున్న వాటిని ఎన్టీఆర్ మార్గ్‌వైపు మళ్లిస్తున్నారు. నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 10, పీవీ మార్గ్‌లో 9, సంజీవయ్య పార్క్ వద్ద 2, జలవిహార్ వద్ద ఒక క్రేన్‌ను ఉపయోగించి నిమజ్జనం చేస్తున్నారు.