ముగిసిన చెన్నై బ్యాటింగ్.. ముంబై లక్ష్యం ఎంతంటే?

19-09-2021 Sun 21:34
  • ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసిన చెన్నై
  • జట్టును ఆదుకున్న రుతురాజ్, జడేజా
  • చివర్లో డ్వేన్ బ్రావో మెరుపులతో 150 దాటిన స్కోరు
Chennai super kings innings over and Mumbai Indians target
ఐపీఎల్ రెండో సెషన్ తొలి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై జట్టును ముంబై పేసర్లు ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే కోలుకోలేని దెబ్బ కొట్టారు. తొలి ఓవర్లోనే ఓపెనర్ డుప్లెసిస్ (0) పెవిలియన్ చేర్చిన బౌల్ట్ ముంబై జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత మొయీన్ అలీ (0) కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.

అంబటి రాయుడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన సురేశ్ రైనా (4), ధోనీ (3) తీవ్రంగా నిరాశపరిచారు. 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును యువ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ (88 నాటౌట్) ఆదుకున్నాడు. తొలుత నెమ్మదిగా ఆడిన రుతురాజ్ ఆ తర్వాత వేగం పెంచి అర్థశతకం పూర్తిచేసుకున్నాడు.

అతనికి రవీంద్ర జడేజా (26) నుంచి మంచి సహకారం అందింది. చివర్లో డ్వేన్ బ్రావో (23) మూడు సిక్సర్లు బాదాడు. మొత్తం 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు 156 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, మిల్నె, బుమ్రా తలా రెండు వికెట్లు తీశారు.