పెళ్లికి నో చెప్పిందని.. అమ్మాయి తమ్ముడిని కిడ్నాప్ చేసిన యువకుడు!

19-09-2021 Sun 21:09
  • ముంబైలో నివసిస్తున్న యువతి కుటుంబం
  • ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన ఎదురింటి కుర్రాడు
  • అమ్మాయి ఒప్పుకోలేదని బెదిరింపులు
  • నాలుగేళ్ల తమ్ముడిని కిడ్నాప్ చేసి చంపేస్తానని హెచ్చరిక
man kidnapped a womans brother for rejecting his marriage proposal
ఎదురింట్లో ఉంటున్న ఒక యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడా యువకుడు. పెళ్లి చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లు ఆమెకు తెలియజేశాడు. ఆమె మాత్రం అతనికి నో చెప్పింది. దీంతో కోపం వచ్చిన ఆ యువకుడు ఆమెపై బెదిరింపులకు దిగాడు. తనను పెళ్లి చేసుకోకపోతే నాలుగేళ్ల ఆమె తమ్ముడిని కిడ్నాప్ చేసి చంపేస్తానని బెదిరించాడు.

అన్నట్లుగానే ఆ పిల్లాడిని కిడ్నాప్ చేశాడు కూడా. ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసును త్వరితగతిన ముగించారు. ఈ ఘటన నవీ ముంబైలో వెలుగు చూసింది. నాలుగేళ్ల పిల్లాడిని కిడ్నాప్ చేసిన కేసులో 27 ఏళ్ల మజిరుల్ మసురుద్దీన్ హక్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పాంధర్ ప్రాంతంలో నివసించే మసురుద్దీన్ తన ఎదురింట్లో ఉండే యువతిని ఇష్టపడుతున్నానని చెప్పాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే ఆమె అంగీకరించలేదు. దీంతోనే ఆమె తమ్ముడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సిటీ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నఅతన్ని పోలీసులు అరెస్టు చేశారు.