IPL: ఐపీఎల్ మళ్లీ వచ్చింది... టాస్ గెలిచిన ధోనీ

  • ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లకు యూఏఈ వేదిక
  • నేడు ముంబయి, చెన్నై మ్యాచ్ తో రీస్టార్ట్
  • బ్యాటింగ్ ఎంచుకున్న ధోనీ
  • ఇరుజట్లలోనూ ఉద్ధండులైన ఆటగాళ్లు
IPL restarts in UAE

క్రికెట్ అభిమానులకు పసందైన వినోదం పంచేందుకు ఐపీఎల్ మళ్లీ వచ్చింది. ఐపీఎల్-14 భారత్ లో సగంలోనే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఐపీఎల్ ఆగిపోగా, మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో నిర్వహిస్తున్నారు. నేడు తొలి మ్యాచ్ జరగనుండగా, ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కు దుబాయ్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

కాగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ముంబయి జట్టుకు సీనియర్ ఆటగాడు కీరన్ పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ముంబయి జట్టులో అన్మోల్ ప్రీత్ సింగ్ ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు. ఇరు జట్ల బలాబలాలు చూస్తే... ముంబయి జట్టులో రోహిత్ లేకపోయినా డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్ రూపంలో భారీహిట్టర్లున్నారు. బౌలింగ్ లోనూ ఆ జట్టుకు అద్భుతమైన వనరులున్నాయి. ప్రపంచ ఉత్తమ పేసర్లుగా పరిగణించే జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లతో ముంబయి బౌలింగ్ పటిష్టంగా ఉంది.

చెన్నై జట్టులోనూ హేమాహేమీలున్నారు. డుప్లెసిస్, మొయిన్ అలీ, రైనా, రాయుడు, ధోనీ, జడేజా, బ్రావోలతో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. బౌలింగ్ లో హేజెల్ వుడ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్ సత్తా చాటితే ఎలాంటి గట్టి జట్టుకైనా తిప్పలు తప్పవు. పిచ్ స్పిన్ కు అనుకూలిస్తే చెన్నై జట్టుకు జడేజా, ముంబయి జట్టుకు కృనాల్ పాండ్య, రాహుల్ చహర్ కీలకం కానున్నారు.

More Telugu News