Somireddy Chandra Mohan Reddy: మేం వదిలేసిన ఎన్నికల్లో గెలిచి సంబరాలు చేసుకుంటున్నారు: సోమిరెడ్డి

  • ఏపీలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
  • వైసీపీకి అత్యధిక స్థానాలు
  • ఎన్నికలు బహిష్కరించామని సోమిరెడ్డి పునరుద్ఘాటన
  • అందుకే ఏకగ్రీవాలు అయ్యాయని వెల్లడి
Somireddy slams YCP leaders over local body elections

ఓవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, మరోవైపు వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం రాజుకుంది. తాజాగా ఈ అంశంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు చూసి మంత్రులు చేసిన కామెంట్లు చూస్తే నవ్వొస్తోందని అన్నారు.

"తమకు ఇన్ని స్థానాలు వచ్చాయని, టీడీపీ ఓడిపోయిందని వారు చెబుతున్నారు. కానీ మేం స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు బాయ్ కాట్ చేశాం. పోలీసులు, అధికారులు, గూండాలను అడ్డంపెట్టుకుని మీరు దౌర్జన్యాలు సాగించారు. మీకు ప్రజలు అధికారం ఇస్తే ఆ ప్రజల హక్కులనే హరిస్తున్నారు. అసలు, స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే హక్కు మీకుందా? మేం బహిష్కరించిన ఎన్నికల్లో మీరు గెలిచి, దాన్నే గొప్పగా చెప్పుకుంటే ఫలితంలేదు. మేం బరిలో లేనందువల్లే అనేకచోట్ల మీకు ఏకగ్రీవాలు అయ్యాయి.

అసలు, మీకెందుకు ఓట్లు వేయాలి. ప్రజల్లో మీపై వ్యతిరేకత వస్తోంది. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే మీకు కనీసం పాతిక సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. మీరు సర్వేలు చేయించుకుంటున్న సంగతి తెలుస్తోంది. వ్యూహకర్త పీకేని మళ్లీ బతిమిలాడుకుని తెచ్చిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది" అని విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News