వర్షాలకు జలమయమైన మార్గం.. కారులో వెళ్తూ నీట మునిగి మహిళ మృతి

19-09-2021 Sun 16:54
  • అత్తగారితో కలిసి హోసూర్ వెళ్తున్న సాథియా
  • తుడైయూర్ వద్ద రైల్వే అండర్‌పాస్‌లో ఇరుక్కున్న కారు
  • ప్రమాదకర స్థాయిలో జలమయమైన మార్గం
  • సాయం అందేలోపే మృతి చెందిన సాథియా
woman dies trying to drive through flooded underpass

అత్తగారితో కలిసి ఇంటికెళ్తున్న సమయంలో ఒక యువతి మరణించింది. జలమయమైన రోడ్డులో నీటమునిగి ఆమె దుర్మరణం పాలైంది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. హోసూర్‌కు చెందిన సి. సాథియా కుటుంబం బంధువులను కలవడం కోసం పుదుక్కొట్టాయ్ వచ్చింది. అక్కడ పిల్లలను వదిలిన సాథియా.. అత్తగారితో కలిసి హోసూర్ బయలు దేరింది.

మార్గమధ్యంలో తుడైయూర్ రైల్వే అండర్‌పాస్‌లోకి వెళ్లింది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ మార్గం మొత్తం పూర్తిగా నీటితో నిండిపోయి ఉంది. ఈ విషయం తెలియని సాథియా చీకట్లో ఆ మార్గంలోకి వెళ్లింది. కొంతసేపటికి దాదాపు పూర్తిగా నీటమునిగిన కారు కదలకుండా ఆగిపోయింది. ఆ సమయంలో సాథియా తన పరిస్థితిని వివరిస్తూ భర్తకు సమాచారం అందించింది.

తుడైయూర్ సమీపంలోని కొందరికి సాథియా భర్త ఫోన్లు చేశారు. దీంతో వెంటనే రైల్వే అండర్‌పాస్‌ చేరుకున్న స్థానికులు సాథియాను రక్షించడానికి ప్రయత్నించారు. సాథియా అత్తగారిని ముందుగా బయటకు తీసుకొచ్చారు. కానీ సీట్ బెల్ట్ మొరాయించడంతో సాథియాను రక్షించడం ఆలస్యమైంది.

ఆ తర్వాత అత్తాకోడళ్లను పుదుక్కొట్టాయ్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు సాథియా అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. తుడైయూర్ స్థానికులకు అండర్ పాస్ విషయం తెలుసని, కానీ సాథికా ఇక్కడి స్థానికురాలు కాదని పోలీసులు తెలిపారు. దీనికితోడు ఆమె రాత్రి సమయంలో ప్రయాణిస్తుండటం కూడా ప్రమాదానికి కారణం అయ్యుండొచ్చని చెప్పారు.