Nitin Gadkari: గంటకు 170 కిమీ వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కియా కార్నివాల్ కారు

  • ఢిల్లీ, ముంబయి మధ్య ఎక్స్ ప్రెస్ హైవే
  • రూ.98 వేల కోట్లతో నిర్మాణం
  • నిర్మాణ పనులు పరిశీలించిన నితిన్ గడ్కరీ
  • స్వయంగా స్పీడ్ టెస్టులో పాల్గొన్న వైనం
Union Minister Nitin Gadkari at DME

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నిర్మాణంలో ఉన్న ఓ రహదారిపై స్పీడ్ టెస్టు నిర్వహించారు. ఈ టెస్టులో గడ్కరీ స్వయంగా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఢిల్లీ-ముంబయి మధ్య ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం జరుపుకుంటోంది. ఈ హైవే పరిశీలన కోసం గడ్కరీ రెండ్రోజుల పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్ ప్రెస్ హైవే నిర్దేశిత ప్రమాణాల మేర నిర్మాణం జరుపుకుంటోందా, లేదా అనే అంశాన్ని స్వయంగా పరిశీలించారు.

ఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై స్పీడ్ టెస్టుకు వెళ్లిన గడ్కరీ కియా కార్నివాల్ కారులో గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. ఆయనతో పాటు కారులో అధికారులు కూడా ప్రయాణించారు. ఆయన డ్రైవరు పక్క సీటులో కూర్చొనగా, ఓ దశలో కారు స్పీడోమీటర్ ముల్లు 170 కిలోమీటర్లను సూచించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయిలను కలిపేందుకు ఉద్దేశించిన ఈ ఎక్స్ ప్రెస్ హైవే 1,380 కిలోమీటర్ల మేర నిర్మాణం జరుపుకుంటోంది. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి ఇదే కానుంది. 8 లేన్లతో రూపుదిద్దుకుంటున్న ఈ రహదారిని భవిష్యత్తులో 12 లేన్లకు విస్తరించనున్నారు. కాగా, ఎనిమిది లేన్లలో నాలుగు లేన్లు కేవలం ఎలక్ట్రిక్ వాహనాల కోసం కేటాయిస్తుండడం విశేషం.

ఈ భారీ రహదారి కోసం రూ.98 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ రహదారి ద్వారా ఢిల్లీ, ముంబయి నగరాల మధ్య ప్రయాణ దూరం 12 గంటలకు తగ్గుతుందని భావిస్తున్నారు.

More Telugu News