ప్రజల హక్కులను గౌరవించండి.. తాలిబన్లకు పాక్ ప్రధాని సలహా

19-09-2021 Sun 15:39
  • షాంఘై సహకార సంస్థ సభ్యదేశాలు కోరిన మరుసటి రోజే ప్రకటన
  • ఆఫ్ఘన్ ప్రభుత్వంలో మైనార్టీలకు స్థానం కల్పించాలన్న ఇమ్రాన్ ఖాన్
  • తాలిబన్లతో చర్చలు ప్రారంభించానంటూ ట్వీట్
started talks with taliban tweets Pak PM Imran Khan

తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వంలో మైనార్టీలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన చెప్పారు. దీనికోసం తాలిబన్లతో ఇప్పటికే చర్చలు ప్రారంభించానని అన్నారు. తాలిబన్ ప్రభుత్వంలో తజకీలు, హజారాలు, ఉజ్బెక్‌లకు వాటా ఇవ్వాలని ఆయన కోరారు. తాలిబన్లతో ఆయన ఎటువంటి చర్చలు జరుపుతున్నది మాత్రం తెలియరాలేదు.

ఆఫ్ఘన్ ప్రజల హక్కులను గౌరవించేలా చర్యలు తీసుకోవాలని తాలిబన్లకు ఇమ్రాన్ సలహా ఇచ్చారు. అలాగే ఆఫ్ఘన్ గడ్డ మరోసారి ఉగ్రవాదుల అడ్డాగా మారకుండా చూడాలని చెప్పారు. ఆఫ్ఘన్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలని, ఈ విషయంలో పాక్ ప్రభుత్వం చొరవ చూపాలని షాంఘై సహకార సంస్థ సభ్య దేశాలు ఇటీవలే కోరాయి. ఆ మరుసటి రోజే ఇమ్రాన్ ఖాన్ ఇలాంటి ప్రకటన చేయడం గమనార్హం. తాలిబన్లు ప్రకటించిన 33 మంది సభ్యుల ప్రభుత్వంలో తజకీలు, మహిళలకు అసలు ప్రాతినిధ్యమే దక్కలేదనే సంగతి తెలిసిందే.