Congress: పంజాబ్​ సీఎం పదవి ఆఫర్​ ను తిరస్కరించిన కాంగ్రెస్​ సీనియర్​ మహిళా నేత.. సీఎం రేసులో సిద్ధూ!

  • రాహుల్ తో నిన్న అర్ధరాత్రి సమావేశం
  • సిక్కులకు అవకాశం ఇవ్వాలని సూచన
  • మధ్యాహ్నం కల్లా సీఎం పేరు ఖరారయ్యే అవకాశం
  • ఎమ్మెల్యేలతో రాజకీయ పరిశీలకుల సమావేశాలు
Ambika Soni Rejects CM Offer Suggests Sikhs To Be The CM

పంజాబ్ ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసినా కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత, గాంధీలకు విధేయురాలైన అంబికా సోని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. నిన్న అర్ధరాత్రి ఆమెతో రాహుల్ గాంధీ సమావేశమైనట్టు తెలుస్తోంది. సమావేశంలో భాగంగా అంబికకు రాహుల్ సీఎం పదవిని ఆఫర్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సిక్కులే ఉండాలని, లేదంటే దాని వల్ల కలిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆమె చెప్పినట్టు సమాచారం. పంజాబ్ హోషియార్ పూర్ జిల్లాకు చెందిన అంబికా సోని.. పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పనిచేశారు. 1969లో ఇందిరాగాంధీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు.

పార్టీలో తాను అడుగడుగునా అవమానాలే ఎదుర్కొన్నానని పేర్కొంటూ నిన్న అమరీందర్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలందరితోనూ నిన్ననే సీఎల్పీ సమావేశం నిర్వహించారు. అదికాకుండా ఇవాళ ఒక్కో ఎమ్మెల్యేతో పార్టీ ముగ్గురు రాజకీయ పరిశీలకులు సమావేశమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం నాటికి పంజాబ్ సీఎం పేరు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధిపతులు సునీల్ జఖార్, ప్రతాప్ సింగ్ బాజ్వా, బియాంత్ సింగ్ మనవడు రవ్నీత్ సింగ్ బిట్టుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారితో పాటు పంజాబ్ పీసీసీ ప్రస్తుత చీఫ్ నవ్ జోత్ సింగ్ సిద్ధూ, సుఖ్జీందర్ సింగ్ రంధావా, త్రుప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా, బ్రహ్మ్ మహీంద్ర, విజయ్ ఇందర్ సింగ్ల, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రాలూ రేసులో ఉన్నారని తెలుస్తోంది.

More Telugu News