ఎంఐఎం ఏ పార్టీకి భయపడదు.. అమిత్ షాకు మాత్రం నిద్రలోనూ మా పార్టీనే కలవరిస్తున్నారు: ఒవైసీ ఎద్దేవా

19-09-2021 Sun 08:05
  • దేశంలోని అన్ని పార్టీలకు ఎంఐఎం అంటే వణుకు
  • ర్యాడికలైజేషన్ వల్ల ఎవరికి నష్టమో మోదీ గ్రహించాలి
  • ఎంఐఎం అంటే భయం వల్లే షా తరచూ తెలంగాణ వస్తున్నారు
MIM Chief Asaduddin Owaisi slams Amit shah
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశంలోని ప్రధాన పార్టీలన్నీ ఎంఐఎం పేరు చెప్పుకునే బతికేస్తున్నాయని ఎద్దేవా చేశారు. నిన్న హైదరాబాద్‌, దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన నిర్మల్ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎంఐఎంను చూసి బీజేపీ ఎంతలా భయపడుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. అమిత్‌షా నిద్రలోనూ ఎంఐఎంనే కలవరిస్తూ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం అంటే భయం ఉండడం వల్లే తరచూ ఆయన తెలంగాణలో వచ్చి వాలిపోతున్నారని విమర్శించారు.

దేశంలోని అన్ని పార్టీలు తమను చూసి భయపడుతున్నాయి తప్పితే, తాము మాత్రం ఏ పార్టీకి భయపడబోమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ర్యాడికలైజేషన్ గురించి మాట్లాడుతున్నారని, నిజానికి అది ఎవరి వల్ల పెరిగిందో, ఎవరికి నష్టమో తెలుసుకోవాలని ఒవైసీ సూచించారు.