పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం: ఇంటిపై పడిన పిడుగు.. రూ. 20 లక్షల నగదు అగ్నికి ఆహుతి!

19-09-2021 Sun 06:23
  • చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో ఘటన
  • కుమారుడి చదువు కోసం పొలం విక్రయం
  • 50 కాసుల బంగారం కూడా దగ్ధమైందన్న బాధిత కుటుంబం
 Lightning strikes home Rs 20 lakh cash burnt in fire
ఇంటిపై పిడుగు పడిన ఘటనలో రూ. 20 లక్షల నగదు, 50 కాసుల బంగారం ఇతర వస్తువులు ధ్వంసమయ్యాయి. పొలం విక్రయించగా వచ్చిన సొమ్ము కళ్లముందే కాలి బూడిదవుతుంటే విలపించడం తప్ప ఆ ఇంటి సభ్యులు మరేమీ చేయలేకపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం గురుభట్లగూడెంలో నిన్న సాయంత్రం జరిగిందీ ఘటన. స్థానికంగా నివసించే కాళ్ల కృష్ణవేణి తన కుమారుడి చదువు కోసం పొలం విక్రయించగా వచ్చిన రూ. 20 లక్షలను ఇంట్లో భద్రపరిచారు.

నిన్న సాయంత్రం ఇంటిపై అకస్మాత్తుగా పిడుగుపడడంతో ఆ సొమ్ముతో పాటు 50 కాసుల బంగారం కూడా దగ్ధమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగుపడిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.