ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు... హైదరాబాదులో సైమా అవార్డుల పండుగ!

18-09-2021 Sat 22:12
 • కన్నుల పండుగలా సైమా అవార్డుల ఫంక్షన్
 • హైదరాబాదులో కార్యక్రమం
 • రెండ్రోజుల పాటు జరగనున్న వేడుక
 • హాజరైన దక్షిణాది తారలు
 • మహర్షి చిత్రానికి మహేశ్ బాబుకు అవార్డు
Mahesh Babu takes best actor award in SIIMA
సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) పండుగ ఈసారి హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో నగరంలో జరిగే ఈ వేడుకలో తారాతోరణం దర్శనమిచ్చింది. టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు, సీనియర్ నటుడు మురళీమోహన్, యువ నటుడు కార్తికేయ, సీనియర్ నటి జీవిత తదితరులు సైమా వేడుకలో సందడి చేశారు. కరోనా నేపథ్యంలో గత అంచె అవార్డుల కార్యక్రమాలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో 2019, 2021లో విడుదలైన చిత్రాలకు తాజా కార్యక్రమంలో అవార్డులు ప్రదానం చేస్తున్నారు.

సైమా విశేషాలు...

 • 2019లో ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు (మహర్షి)
 • మహర్షి చిత్రంలో 'ఇదే కదా..' పాటకు ఉత్తమ గీత రచయితగా శ్రీమణి.
 • మజిలి చిత్రానికి గాను 'ప్రియతమ ప్రియతమ' పాటకు ఉత్తమ గాయనిగా చిన్మయి శ్రీపాదకు పురస్కారం.
 • ఇస్మార్ట్ శంకర్ లో టైటిల్ సాంగ్ ఆలపించిన అనురాగ్ కులకర్ణికి ఉత్తమ గాయకుడిగా అవార్డు.
 • ఉత్తమ తొలి చిత్రం అవార్డు కేటగిరీలో స్టూడియో 99కి పురస్కారం. 'మల్లేశం' చిత్రానికి ఈ అవార్డు ప్రదానం. స్టూడియో 99 తరఫున అవార్డును దిల్ రాజు అందుకున్నారు.  
 • అరంగేట్రంలో అద్భుత నటన కనబర్చిన కేటగిరీలో శివాత్మిక రాజశేఖర్ కు బెస్ట్ డెబ్యూ అవార్డు.
 • బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో కోడూరి శ్రీసింహాకు అవార్డు. 'మత్తు వదలరా' చిత్రానికి గాను పురస్కారం.
 • ఏజెంట్ సాయి శ్రీనివాస్ చిత్రానికి గాను బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా స్వరూప్ కు అవార్డు.