Cyberabad: 8,500 విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి: స్టీఫెన్ రవీంద్ర

8500 Ganesh idols are ready for immersion says Stephen Ravindra
  • సైబరాబాద్ పరిధిలో 10 వేల మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాం
  • షిటీమ్స్ ను సివిల్ డ్రస్ లో రంగంలోకి దింపుతున్నాం
  • నిమజ్జనాలకు 36 చెరువులను ఎంపిక చేశాం
గణేశ్ నిమజ్జనోత్సవాలకు గట్టి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 10 వేల మందితో పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని ప్రాంతాలను కమాండ్ కంట్రోల్ నుంచి ఐటీ సెల్ మానిటరింగ్ చేస్తుందని చెప్పారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 8,500 విగ్రహాలు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళలు, చిన్నారుల రక్షణను దృష్టిలో ఉంచుకుని షీటీమ్స్ ను సివిల్ డ్రస్ లో రంగంలోకి దింపుతున్నామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

సైబరాబాద్ పరిధిలో నిమజ్జనాల కోసం 36 చెరువులను ఎంపిక చేశామని వెల్లడించారు. చెరువుల వద్ద లైట్లు, మొబైల్ టాయిలెట్లు, శానిటైజేషన్ ఏర్పాట్లు చేశామని చెప్పారు. రోడ్లను కూడా మరమ్మతు చేశామని తెలిపారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 100కి ఫోన్ చేయాలని సూచించారు. నిమజ్జనాలు పూర్తయ్యేంతవరకు ఏసీపీలు, డీసీపీలు, ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు.
Cyberabad
Ganesh Immersion
Stephen Raveendra

More Telugu News