Jagityal: గల్ఫ్‌లో పక్షవాతానికి గురైన జగిత్యాల వాసి.. రూ. 3.4 కోట్ల బిల్లు మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి!

Dubai Mediclinic City Hospital waives over 3 crore bill for telangana worker
  • రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు
  • ఆసుపత్రిలో 9 నెలలపాటు కోమాలో
  • బిల్లు మాఫీ చేయించిన గల్ఫ్ కార్మికుల పరిరక్షణ సమితి
  • హైదరాబాద్ వచ్చేందుకు రూ. 4.40 లక్షలు ఇప్పించిన వైనం
బతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్లి అనారోగ్యానికి గురైన జగిత్యాల జిల్లా వాసి చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి కోమాలోకి వెళ్లిపోయాడు. 9 నెలలపాటు అతడు ఆసుపత్రిలోనే కోమాలో ఉండిపోయాడు. అతడి చికిత్సకు ఏకంగా రూ. 3.4 కోట్ల బిల్లు కాగా, మొత్తం బిల్లును మాఫీ చేసిన ఆసుపత్రి మానవత్వాన్ని చాటుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెగడపల్లి మండలం సుద్దపెల్లి గ్రామానికి చెందిన కట్ల గంగారెడ్డి రెండేళ్ల క్రితం దుబాయ్ వలస వెళ్లాడు. అక్కడ పనిచేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో గతేడాది డిసెంబరు 25న అతడిని దుబాయ్‌లోని మెడ్‌క్లినిక్ సిటీ ఆసుపత్రిలో చేర్చారు.

అతడిని పరీక్షించిన వైద్యులు పక్షవాతంగా నిర్ధారించి మెదడులో ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. శస్త్రచికిత్సకు వైద్యులు సిద్ధమవుతుండగానే గంగారెడ్డి కోమాలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న అతడికి వైద్యులు చికిత్స అందించారు.

మరోవైపు, అక్కడే ఉన్న గంగారెడ్డి కుమారుడు మణికంఠ, అతడి స్నేహితుడు ఇబ్రహీం కలిసి దుబాయ్‌లోని గల్ఫ్ కార్మికుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు గుండేళ్లి నరసింహను కలిసి విషయం చెప్పారు. తన తండ్రిని ఎలాగైనా స్వదేశం చేర్పించేందుకు సాయం చేయాలని మణికంఠ కోరాడు. దీంతో ఆసుపత్రికి వెళ్లిన ఆయన బిల్లు ఏకంగా రూ. 3.40 కోట్ల బిల్లు అయిందని తెలిసి షాకయ్యారు.

తమది చాలా పేద కుటుంబమని అంత బిల్లు చెల్లించుకోలేమని, బిల్లు మాఫీ చేయాలని గంగారెడ్డి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. మరోవైపు, గల్ఫ్ కార్మికుల పరిరక్షణ సమితి సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతోపాటు, యూఏఈలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడి మొత్తం బిల్లును మాఫీ చేయించారు.

అంతేకాదు, భారత అధికారులతో మాట్లాడి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని నిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు అవసరమయ్యే రూ. 4.40 లక్షలు కూడా ఇప్పించారు. బిల్లు మాఫీ చేసిన ఆసుపత్రి యాజమాన్యానికి, ఇందుకు సహకరించిన పరిరక్షణ సమితికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Jagityal
Dubai
Gulf
Med Clinic City Hospital
Telangana

More Telugu News