Congress: మోదీ, కేసీఆర్ అంతా తామే చేసినట్టు చెప్పుకుంటున్నారు: గజ్వేల్ సభలో మల్లికార్జున ఖర్గే ఎద్దేవా

Congress Dalita girijana sabha in Gajwel
  • తెలంగాణలోని అన్ని వర్గాల్లో నైరాశ్యం
  • ఎస్సీ, ఎస్టీల హక్కుల సాధనకు కాంగ్రెస్ కలిసొస్తుంది
  • టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనపై చార్జ్‌షీట్ విడుదల
తామే అంతా చేసినట్టు కేసీఆర్, మోదీ చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే అన్నారు. నిన్న గజ్వేల్‌లో నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు హాజరైన ఆయన.. ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ పార్టీ రూపొందించిన చార్జ్‌షీట్‌ను విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లోనూ నైరాశ్యం నెలకొందని అన్నారు. ఎస్సీలు, గిరిజనులు వారి హక్కుల సాధనకు రెడీ అయ్యారని, కాంగ్రెస్ వారి వెంట ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అడుగుతున్నారని, అంతా తామే చేసినట్టు మోదీ, కేసీఆర్ చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. దేశం కోసం ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు.

ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, వి.హనుమంతరావు, గీతారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.
Congress
Mallikarjun Kharge
Gajwel
Revanth Reddy

More Telugu News