Farmer: బీహార్‌లో వ్యక్తుల ఖాతాల్లోకి కోట్ల రూపాయల వరద.. రైతు అకౌంట్‌లో రూ. 52 కోట్లు!

  • సామాన్యుల ఖాతాల్లోకి కోట్ల రూపాయల జమ
  • డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారుల చర్యలు
  • కొంతైనా ఇవ్వాలని ప్రాధేయపడుతున్న రైతు
Bihar farmer receives Rs 52 crore in pension account

బీహార్‌లో సామాన్యుల ఖాతాలు కోట్ల రూపాయలతో నిండిపోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ, అకస్మాత్తుగా అంతంత డబ్బు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత  సొమ్ము తమది కాదని తెలిసి నిరుత్సాహానికి గురవుతున్నారు.

కతిహార్ జిల్లా బగౌరా పంచాయతీకి చెందిన ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో మొన్న రూ. 960 కోట్లు జమకాగా, తాజాగా ముజఫరాపూర్ జిల్లాలోనూ అలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. కతిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రామ్ బహదూర్ షా రైతు. పింఛను ఖాతాకు ఆధార్ కార్డు, వేలిముద్ర వెరిఫికేషన్ కోసం బ్యాంకుకు వెళ్లిన ఆయన యథాలాపంగా తన ఖాతాలో ఎంత ఉందో చెప్పాలని బ్యాంకు అధికారులను కోరాడు.

వృద్దుడి ఖాతాను చెక్ చేసిన అధికారులు తొలుత నోరెళ్లబెట్టగా, విషయం తెలిసి వృద్ధుడు షాకయ్యాడు. అతడి ఖాతాలో ఏకంగా రూ. 52 కోట్లు ఉండడమే అందుకు కారణం. అంతమొత్తం ఉందనగానే తనకు నోట మాట కూడా రాలేదని అన్నాడు. ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నాడు. అయితే, మరీ అంత సొమ్ము వద్దు కానీ, ఎంతో కొంత ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టాలని బహదూర్ షా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

మరోవైపు, బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడుతుండడంతో ఖాతాదారులు వాటిని డ్రా చేసుకోకుండా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, బీహార్‌కే చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఇటీవల రూ. 5.5 లక్షలు పడగా బ్యాంకు అధికారులు బతిమాలినా వాటిని వెనక్కి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆ డబ్బులు తనకు మోదీ వేశారని, వెనక్కి ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పడంతో బ్యాంకు అధికారులు విస్తుపోయారు.

More Telugu News