పెంచే స్తోమత లేదంటూ బిడ్డను అమ్మేసిన తల్లి.. మళ్లీ కావాలంటూ పోలీసు కేసు

17-09-2021 Fri 22:39
  • కర్ణాటకలో ఆగస్టు 19న బిడ్డకు జన్మనిచ్చిన రేణుక
  • నర్సు సాయంతో రూ.5 వేలకు విక్రయం
  • తన బాబును తిరిగిచ్చేయాలంటూ నర్సుతో గొడవ
  • నర్సు సస్పెన్షన్.. తల్లిపై మూడు కేసులు నమోదు
mother sells child for 5 thousand
తన బిడ్డను పెంచుకునే స్తోమత లేదని బాధపడిన ఆ తల్లి కఠిన నిర్ణయం తీసుకుంది. పుట్టి వారం కూడా గడవని తన బిడ్డను నర్సు సాయంతో అమ్మేసుకుంది. కానీ కన్నప్రేమ చంపుకోలేక మళ్లీ ఆస్పత్రికి తిరిగెళ్లింది. తన బిడ్డను తిరిగిచ్చేయాలంటూ ఆ నర్సుతో వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురలో జరిగింది. తికోట ప్రాంతానికి చెందిన రేణుక అనే యువతి గర్భంతో స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చేరింది.

ఆగస్టు 19న ఆమెకు డెలివరీ అయింది. పండంటి బిడ్డ పుట్టినా కూడా ఆమె సంతోషించలేకపోయింది. బిడ్డను పోషించే ఆర్థిక స్తోమత తనకు లేదని బాధపడింది. ఆస్పత్రిలోని ఒక నర్సు సాయం తీసుకొని తన బిడ్డను రూ.5 వేలకు అమ్మేసింది. ఇదంతా ఆగస్టు 26న జరిగింది. ఆ తర్వాత రేణుక డిశ్చార్జి అయింది. బిడ్డను మర్చిపోలేక మళ్లీ ఆస్పత్రికి తిరిగొచ్చింది. నర్సును కలిసి తన బిడ్డను తిరిగిప్పించాలని కోరింది.

దీనికి సదరు నర్సు ససేమిరా అనడంతో వాగ్వాదానికి దిగింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి యాజమాన్యం సదరు నర్సును సస్పెండ్ చేసింది. పోలీసులు రేణుకపై కూడా మూడు కేసులు నమోదు చేసినట్లు సమాచారం.