Swiggy: ఇక నుంచి జీఎస్టీ వసూలు చేయనున్న జొమాటో, స్విగ్గీ!

  • ఇప్పటి వరకూ ఆర్డర్లపై జీఎస్టీ చెల్లించిన రెస్టారెంట్లు
  • లెక్కల్లో తారుమారు చేసిన కొన్ని రెస్టారెంట్లు
  • జీఎస్టీ వసూలు, చెల్లింపు బాధ్యతలు కూడా జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలకే
  • జీఎస్టీ మండలి సమావేశం అనంతరం ప్రకటించిన ఆర్థిక శాఖ
Swiggy and Zomato To Collect GST

ఇకపై జొమాటో, స్విగ్గీ తదితర ఫుడ్ ఆర్డరింగ్ సంస్థలే ఆర్డర్లపై జీఎస్టీ వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే దీని వల్ల వినియోగదారులపై ఎటువంటి భారమూ పడబోదని వివరణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు.

కొత్త పన్నులేవీ లేవని వెల్లడించిన ఆమె.. ఫుడ్ ఆర్డరింగ్ సంస్థలే యూజర్ల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు. ఇప్పటి వరకూ ఈ యాప్స్ అన్నీ కూడా టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కింద నమోదై ఉన్నాయి. ఈ విషయంపై ఆర్థిక శాఖ సెక్రటరీ తరుణ్ బజాజ్ వివరణ ఇచ్చారు.

‘‘మనం ఒక యాప్ నుంచి ఆహారం ఆర్డర్ ఇస్తే..  దీనిపై జీఎస్టీని ఇప్పటి వరకూ రెస్టారెంట్లే చెల్లించాయి. అయితే కొన్ని రెస్టారెంట్లు ఈ పన్ను చెల్లించడం లేదు. అందుకే ఇక నుంచి సదరు యాప్స్ ఈ జీఎస్టీ వసూలు చేసి చెల్లించాలని నిర్ణయించాం’’ అని ఆయన తెలిపారు.

హర్యానాలోని కొన్ని రెస్టారెంట్లు చూపించిన లెక్కలకు, ఆ రెస్టారెంట్ల నుంచి ఈ యాప్స్ తీసుకున్న ఆర్డర్లకు లెక్కల్లో తేడా వచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు.

ఇలా ఆదాయం తక్కువగా చూపించిన కొన్ని రెస్టారెంట్లు పన్ను ఎగవేసినట్లు తరుణ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై జీఎస్టీ వసూలు చేసి చెల్లించే బాధ్యతను ఈ ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్‌కే అప్పగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

More Telugu News