తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతామన్న కేసీఆర్ హామీలు ఏమయ్యాయి?: సూటిగా ప్రశ్నించిన అమిత్ షా

17-09-2021 Fri 22:10
  • విమోచన దినోత్సవ కార్యక్రమాలు చేపట్టిన బీజేపీ
  • నిర్మల్ లో జరిగిన కార్యక్రమానికి అమిత్ షా హాజరు
  • బలిదానాలు కేసీఆర్ కు పట్టవా అంటూ ఆగ్రహం
  • వచ్చే ఎన్నికల్లో అన్ని లోక్ సభ సీట్లు గెలుస్తామని ధీమా
Amit Shah questions CM KCR on Telangana Vimochan Diwas

సెప్టెంబరు 17 సందర్భంగా నిర్మల్ లో బీజేపీ ఏర్పాటు చేసిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన కోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు, నాటి వీరుల ఆత్మత్యాగాలు కేసీఆర్ కు పట్టవా? అని నిలదీశారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లోక్ సభ సీట్లన్నింటిని బీజేపీనే గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు నిజమైన స్వేచ్ఛ లభించినట్టవుతుందని, తాము మజ్లిస్ కు భయపడబోమని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లను బీజేపీ వ్యతిరేకిస్తుందని వివరించారు. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ, ఈటల రాజేందర్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా పిలుపునిచ్చారు.