చివరి నిమిషంలో పాక్ పర్యటన రద్దు చేసుకున్న న్యూజిలాండ్ క్రికెట్ జట్టు

17-09-2021 Fri 20:19
  • కాసేపట్లో తొలి వన్డే ఆడాల్సి ఉండగా నిర్ణయం
  • సెక్యూరిటీ అలర్ట్ రావడంతో సిరీస్ రద్దు చేసుకున్న కివీస్
  • ఏకపక్ష నిర్ణయమన్న పాక్ క్రికెట్ బోర్డు
  • ఇంగ్లండ్ పర్యటనపై కూడా అనుమానాలు!
New Zealand cancels white ball tour of Pakistan in last minute

పాకిస్థాన్ క్రికెట్‌కు గట్టి దెబ్బ తగిలింది. సుమారు 16 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు అర్థాంతరంగా తమ సిరీస్‌ను రద్దు చేసుకుంది. మరికాసేపట్లో రావల్పిండి వేదికగా తొలి వన్డే ప్రారంభం కావల్సి ఉండగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జడ్‌సీ) ఈ నిర్ణయం వెల్లడించింది.

తమ దేశ ప్రభుత్వం నుంచి భద్రతా పరంగా హెచ్చరికలు వచ్చాయని, ఈ కారణంగానే పర్యటన రద్దు చేసుకుంటున్నామని ఎన్‌జడ్‌సీ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం పూర్తిగా ఏకపక్షమని, సడెన్‌గా ఈ విషయం తమకు చెప్పారని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఆతిథ్య జట్టు భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ తాము తీసుకున్నామని, తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా న్యూజిలాండ్ ప్రధానికి ఫోన్ చేశారని పీసీబీ వెల్లడించింది.

న్యూజిల్యాండ్ నిర్ణయం క్రికెట్ అభిమానులను షాక్‌కు గురిచేస్తుందని పాక్ ఆరోపించింది. అయితే కివీస్ నిర్ణయం తర్వాత త్వరలోనే పాకిస్థాన్‌లో జరగాల్సిన ఇంగ్లండ్ పర్యటనపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఈ సిరీస్‌పై వచ్చే 48 గంటల్లో తాము నిర్ణయం తీసుకుంటామని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. న్యూజిలాండ్ నిర్ణయం తమకు తెలిసిందని, తాము కూడా పాక్ పర్యటనపై సాధ్యమైనంత వేగంగా నిర్ణయం తీసుకుంటామని ఈసీబీ ప్రతినిధులు తెలిపారు.