ముంబయిలో 87 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు... తాజా సీరో సర్వేలో వెల్లడి

17-09-2021 Fri 19:47
  • కరోనాతో అతలాకుతలమైన ముంబయి
  • ఐదుసార్లు సీరో సర్వే నిర్వహించిన బీఎంసీ
  • ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 9 మధ్యన సర్వే
  • 8,674 మంది నుంచి నమూనాల సేకరణ
Sero survey in Mumbao conducted by BMC

భారత్ లో అత్యధికంగా కరోనా ప్రభావానికి లోనైన నగరాల్లో ముంబయి ముందువరుసలో ఉంటుంది. తాజాగా ఈ మహానగరంలో నిర్వహించిన సీరో సర్వేలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ముంబయి వాసుల్లో 87 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్టు గుర్తించారు. వారందరూ కనీసం ఒక్కసారైనా కరోనా బారినపడి ఉంటారని ఈ సర్వే ద్వారా వెల్లడైంది. థర్డ్ వేవ్ అంచనాల నేపథ్యంలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 9 మధ్యన ఈ సీరో సర్వే నిర్వహించారు.

ఈ నేపథ్యంలో బృహన్ ముంబయి కార్పొరేషన్ ప్రజలను హెచ్చరించింది. సర్వేలో వెల్లడైన మేరకు, సీరో ప్రాబల్య స్థాయిలో యాంటీబాడీలతో కరోనా నుంచి అత్యధిక రక్షణ ఉంటుందన్న భరోసా ఉండదని స్పష్టం చేసింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వినియోగించాలని, భౌతికదూరం పాటించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. బీఎంసీ నిర్వహించిన సీరో సర్వేల్లో తాజాది ఐదో సర్వే. ఇందుకోసం 8,674 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్ష జరిపారు.